టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా ఛేదించలేక 139/5కే పరిమితమైంది. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో లిటన్ దాస్ (44; 43 బంతుల్లో 4x4), మహ్మదుల్లా (31; 24 బంతుల్లో 2x4, 1x6) రాణించగా.. నయీం (17), సౌమ్య సర్కార్ (17) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో రస్సెల్, హొసెన్, రవి రాంపాల్, బ్రావో, హోల్డర్ తలో వికెట్ తీశారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లో పడింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (6), క్రిస్ గేల్ (4) ఘోరంగా విఫలమయ్యారు. మూడో ఓవర్లో లూయిస్ క్యాచ్ ఔట్ కాగా.. ఐదో ఓవర్లో గేల్ బౌల్డయ్యాడు. దీంతో పవర్ ప్లే (6 ఓవర్లు) పూర్తయ్యే సరికి వెస్టిండీస్ స్కోరు 29/2గా ఉంది. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన షిమ్రోన్ హెట్ మైర్ (9), ఆండ్రూ రస్సెల్ (0), డ్వేన్ బ్రావో (1) కూడా రాణించలేదు. అరంగేట్ర ఆటగాడు రోస్టన్ ఛేజ్ (39), ఆఖర్లో వచ్చిన నికోలస్ పూరన్ (40; 22 బంతుల్లో 1x4, 4x6) ఆదుకున్నారు. జేసన్ హోల్డర్ (15), పొలార్డ్ (14) నాటౌట్‌గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో మెహెదీ హసన్, షొరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్ రెండేసి వికెట్లు తీశారు.