టీ20 ప్రపంచకప్లో(T20 World Cup 2021) భాగంగా నేడు (అక్టోబర్ 29) పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో(PAK vs AFG T20) ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ను వీక్షించేందుకు పాక్, అఫ్గాన్ అభిమానులు విపరీతంగా వెళ్లారు. ఈ క్రమంలో కొందరు అఫ్గాన్ అభిమానులు టిక్కెట్లు లేకుండానే గుంపులుగా మైదానంలోకి ప్రవేశించారు. దీంతో టిక్కెట్లు తీసుకున్న పాక్ అభిమానులు తీవ్రంగా ఇబ్బందిపడినట్లు తెలిపారు.
ఈ మ్యాచ్ను తిలకించేందుకు లండన్ నుంచి వచ్చిన ఓ పాకిస్థాన్ అభిమాని మైదానంలోకి వెళ్లలేకపోయాడు. కొందరు ఫ్యాన్స్ అక్రమంగా గ్రౌండ్లోకి వెళ్లడం వల్ల ముందుగానే గేట్లు మూసివేశారని అభిమాని వాపోయాడు. దీంతో మ్యాచ్ చూడకుండానే వెనుదిరుగుతున్నట్లు తెలిపాడు.
కొందరు అఫ్గాన్ అభిమానులు వ్యవహరించిన తీరువల్ల టిక్కెట్లు తీసుకున్న చాలా మంది మ్యాచ్ను చూసే అవకాశం కోల్పోయారు. అభిమానులను అదుపు చేసేందుకు సెక్యూరిటీ వారు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.