తెలుగు షట్లర్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన పీవీ సింధు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైంది. ఒలింపిక్ రజత పతక విజేత అయిన సింధు పేరును 2017లోనే పద్మభూషణ్‌కు సిఫారసు చేశారు. కానీ తుది జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. 2015లో ఈ బ్యాడ్మింటన్ స్టార్ పద్మశ్రీ అవార్డు అందుకుంది.
అసాధారణ ప్రతిభ...
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు అసాధారణ ప్రతిభ చూపింది. ప్రకాశ్ పదుకొనే కాంస్యం నెగ్గాక మరో పతకం కోసం మూడు దశాబ్దాలు సాగిన నిరీక్షణకు 2013లో తెరదించుతూ కాంస్యం నెగ్గింది. అయితే తర్వాత ఇంకో మూడు పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించింది. రెండుసార్లు ఫైనల్లో గొప్పగా పోరాడి ఓడి రజతాలతో సరిపెట్టుకుంది. అయితే గతేడాది మాత్రం అయిదో పతకం రూపంలో స్వర్ణం సొంతం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరఫున తొలి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పీవీ సింధుకు పేరు తెచ్చుకుంది.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు... మొత్తం రెండు రజతాలు, రెండు కాంస్యాలు, ఒక స్వర్ణం గెలిచింది. ఈ టోర్నీలో అత్యధిక పతకాలు సాధించిన జాంగ్ నింగ్ సరసన నిలిచిందీ తెలుగుతేజం.