Women Under 17 Football World Cup: భారత్‌లో మళ్లీ సాకర్ సమరానికి సమయం ఆసన్నమైంది. ఫిఫా అండర్-17 అమ్మాయిల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. మంగళవారం ఫుట్‌బాల్ సంబరాలకు తెరలేవనుంది. ఉరకలెత్తే రక్తంతో.. మైదానంలో గోల్స్ వేటలో సాగే టీనేజీ అమ్మాయిల ఆటను వీక్షించడమే ఇక తరువాయి. 20 రోజుల పాటు అభిమానులకు కిక్కే కిక్కు. 30న నవీ ముంబయిలో ఫైనల్ జరుగుతుంది.
- ఇది ఏడో ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్. ఈ అమ్మాయిల ప్రపంచకప్‌కు భారత్ తొలిసారి ఆతిథ్యమివ్వనుంది. 2008లో ఈ ప్రపంచకప్‌కు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి టోర్నీ నిర్వహిస్తున్నారు.
- 2020లోనే జరగాల్సిన ఈ ప్రపంచకప్ కరోనా కారణంగా అప్పుడు రద్దయింది. ఓ ఫిఫా టోర్నీ భారత్‌లో జరగబోతుండడం ఇది రెండోసారి. 2017లో ఇక్కడ అండర్-17 పురుషుల ప్రపంచకప్‌ను నిర్వహించారు.
- బయటి వర్గం జోక్యం కారణంగా ఈ ఏడాది ఆగస్టులో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్)పై నిషేధం విధించిన ఫిఫా ఈ ప్రపంచకప్‌ను ఇక్కడ నిర్వహించబోమని ప్రకటించింది. కానీ ఫిఫా డిమాండ్లకు అనుగుణంగా ఎఐఎఫ్‌ఎఫ్ తగిన చర్యలు తీసుకోవడంతో నిషేధం తొలగిపోయి ప్రపంచకప్ నిర్వహణకు మార్గం సుగమమైంది.
- ఈ ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్‌తో పాటు మొరాకో, టాంజానియా అరంగేట్రం చేస్తున్నాయి. వీటితో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ స్పెయిన్, చైనా, జపాన్, నైజీరియా, కెనడా, మెక్సికో, అమెరికా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ టైటిల్ వేటకు సిద్ధమయ్యాయి.
- ఒడిశాలోని భువనేశ్వర్ (కళింగ స్టేడియం), గోవాలోని మార్గావ్ (నెహ్రూ స్టేడియం), మహారాష్ట్రలోని నవీ ముంబయి (డీవై పాటిల్ స్టేడియం) ఈ ప్రపంచకప్‌కు వేదికలు.
- మహిళా శక్తిని చాటేలా ఈ ప్రపంచకప్ మస్కట్‌గా ఆసియా సివంగి (ఆడ సింహాన్ని)ని ఎంపిక చేశారు. దీనికి 'ఇభా' అని పేరు పెట్టారు.