భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై (Vinesh Phogat) తాత్కాలిక నిషేధం విధించింది భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) (WFI). టోక్యో ఒలింపిక్స్ శిబిరంలో అమర్యాదగా ప్రవర్తించినందుకు ఈ చర్యలు తీసుకుంది. ఈ విషయమై వివరణ ఇచ్చేందుకు ఆగస్టు 16 వరకు గడువు ఇచ్చింది. దుష్ప్రవర్తనకు గానూ మరో యువ రెజ్లర్ సోనమ్‌కు (Sonam Malik Wrestling) కూడా డబ్ల్యూఎఫ్ఐ నోటీసులు జారీ చేసింది.
కారణమిదేనా?
ఒలింపిక్స్‌కు ముందు శిక్షణ కోసం కోచ్ వోల్లర్ అకోస్‌తో కలిసి హంగేరీకి వెళ్లింది వినేశ్ (Vinesh Phogat). అక్కడి నుంచి నేరుగా ఈవెంట్ సమయానికి టోక్యోకు చేరుకుంది. భారత అథ్లెట్లు సోనమ్, అన్షు మాలిక్, సీమా బిస్లా ఉన్న దగ్గర ఆమెకు గదిని కేటాయించారు. అయితే అక్కడ ఉండటానికి వినేశ్ నిరాకరించింది. పైగా, వారంతా ఇండియా నుంచి వచ్చారు. వారికి కొవిడ్ ఉండే అవకాశం ఉందని కారణంగా తెలిపింది. దీంతోపాటు భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసే శిబిరం దగ్గర శిక్షణ తీసుకోవటానికి కూడా ఆసక్తి చూపలేదు వినేశ్. ఆమె పాల్గొన్న మ్యాచ్‌ల్లోనూ అధికారిక స్పాన్సర్ జెర్సీని కాకుండా వేరేది ధరించింది. చివరికి పతకం సాధిస్తుందనుకున్నా ఆశలకు గండికొడుతూ సెమీస్‌లోనే నిష్క్రమించింది.
"వినేశ్ తప్పుచేసింది. ఒలింపిక్ గ్రామంలో చాలా అమర్యాదగా ప్రవర్తించింది. అందుకే ఆమెపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నాం. ఈ విషయంపై వివరణ ఇచ్చే వరకు ఏ విధమైన పోటీల్లో పాల్గొనడానికి అవకాశం లేదు. ఇది క్షమించాల్సిన విషయం కాదు. సీనియర్ రెజ్లర్లు ప్రవర్తించాల్సిన విధానం ఇది కాదు. ఇదే మా చివరి నిర్ణయం.
- భారత రెజ్లింగ్ సమాఖ్య.