కరోనా వైరస్ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా పాల్గొనబోదంటూ ఆ దేశానికి చెందిన ఓ వెబ్సైట్ పేర్కొంది. మార్చి 25న క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ది స్పోర్ట్స్ ఇన్ డీపీఆర్ కొరియా పేరుతో ఉన్న వెబ్సైట్ వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొవిడ్ సంక్షోభం కారణంగానే కొరియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు వెబ్సైట్ తెలిపింది. ఇందులో తమ దేశం పేరును డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా పేర్కొంది.
ఇదీ చదవండి:కమ్మేస్తున్న కరోనా.. ఐపీఎల్లో పెరుగుతున్న కేసులు
ఉత్తర కొరియా నిర్ణయం పట్ల తమకెలాంటి సమాచారం లేదని తెలిపింది దక్షిణ కొరియా ఒలింపిక్ కమిటీ. సదరు వెబ్సైట్ ఆపరేటర్‌ను వెంటనే నిర్ధరించలేమని పేర్కొంది.
కాగా, అప్పటివరకు ఒకరంటే ఒకరికి పడని ఈ కొరియా దేశాలు.. 2018 వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా మాటలు కలిపే ప్రయత్నాలు చేశాయి. దక్షిణ కొరియా వేదికగా జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో 22 మంది ఉత్తర కొరియా అథ్లెట్లు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ అధికారులు, ఆర్టిస్ట్‌లు, జర్నలిస్టులు మొత్తం 230 మంది ఆటగాళ్ల వెంట దక్షిణ కొరియాకు వచ్చారు. ఆ బృందంలో కిమ్ సోదరి కూడా ఉంది. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య దౌత్యం ప్రారంభమైంది.
ప్రస్తుతం ఉత్తర కొరియా నిజంగానే ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాలనుకుంటే మాత్రం మళ్లీ ఇరు దేశాల మధ్య సఖ్యత చెడే అవకాశం ఉంది. అంతే కాక ఈ దఫా ఒలింపిక్స్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను ఆహ్వానించనున్నట్లు జపాన్ ప్రధాని ఇది వరకే వెల్లడించారు.
ఇదీ చదవండి:'మద్యం లోగోను తీసేయమని అలీ అడగలేదు'