Roger Federer Retirement : ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో ఓ శకం ముగిసింది. తన అద్భుత ఆటతీరుతో, అసాధారణ ప్రదర్శనతో దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు టెన్నిస్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన వీరుడు రాకెట్ వదిలేయనున్నాడు. 24 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన తన కెరీర్‌కు తెరదించుతూ.. 41 ఏళ్ల వయసులో రోజర్ ఫెదరర్ ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. 20 విజయాలతో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అతను గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు.
వచ్చే వారం లండన్‌లో జరిగే లేవర్ కప్ తనకు చివరి టోర్నీ అని వెల్లడించాడు. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ట్విటర్‌లో నాలుగు పేజీల లేఖ పోస్టు చేశాడు. "ఇన్నేళ్లుగా టెన్నిస్ నాకిచ్చిన గొప్ప బహుమతి.. ఈ ప్రయాణంలో నేను కలిసిన వ్యక్తులే. నా స్నేహితులు, ప్రత్యర్థులు, అభిమానులు ఆటకు ప్రాణం పోశారు. మీ అందరితో ఓ వార్త పంచుకోవాలనుకుంటున్నా. గత మూడేళ్లుగా గాయాలు, శస్త్రచికిత్సలు నాకు సవాలు విసిరాయని మీకు తెలుసు.
తిరిగి పూర్తి స్థాయి పోటీతత్వంతో ఆటలోకి తిరిగొద్దామనుకున్నా. కానీ నా శరీరం సామర్థ్యం, పరిమితులు నాకు తెలుసు. అది నాకు ఆలస్యంగా ఓ సందేశం పంపింది. నాకిప్పుడు 41 ఏళ్లు. 24 ఏళ్లకు పైగా 1500 మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఆడా. నా కల కంటే టెన్నిస్ నాకెంతో ఇచ్చింది. వచ్చే వారం లండన్‌లో ఆడే లేవర్ కప్ నా చివరి ఏటీపీ టోర్నీ. భవిష్యత్‌లో టెన్నిస్ ఆడతా. కానీ గ్రాండ్‌స్లామ్ లేదా టూర్ టోర్నీల్లో పాల్గొనను. ఇదో చేదు తీపి కలగలిసిన నిర్ణయం. నాతో ప్రతి నిమిషాన్ని గడిపిన నా భార్య మిర్కాకు ధన్యవాదాలు. గత 24 ఏళ్లు 24 గంటలుగా అనిపిస్తోంది. మరోవైపు పూర్తి జీవితాన్ని గడిపేశాననిపిస్తోంది" అని అందులో ఫెదరర్ పేర్కొన్నాడు.
నంబర్‌వన్ ఆటగాడిగా అయిదు సీజన్లను ముగించిన అతను.. గత కొన్నేళ్లుగా మోకాలి గాయం, శస్త్రచికిత్సలతో ఆటకు దూరమవుతూ వచ్చాడు. చివరగా 2021 వింబుల్డన్‌లో ఆడాడు. టెన్నిస్ క్రీడాకారిణి మిర్కాను పెళ్లాడిన ఫెదరర్‌కు నలుగురు (రెండు జతల కవలలు) పిల్లలున్నారు. 103 టూర్ స్థాయి టైటిళ్లు, సింగిల్స్‌లో 1,251 మ్యాచ్‌లతో జిమ్మీ కానర్స్ తర్వాత ఓపెన్ శకంలో ఈ ఘనతలు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
సొగసు చూడతరమా..
మనిషే కాదు.. ఆటా అందమే. ఫెదరర్ ప్రస్తావన రాగానే అభిమానుల్లో స్ఫురించేదిదే. టెన్నిస్ చరిత్రలో మేటి ఆటగాడెవరన్న దానిపై భిన్నాభిప్రాయాలుండొచ్చు. ఎవరు గొప్పన్న దానిపై ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. అత్యంత అందమైన, చూడముచ్చటైన ఆట ఎవరిదంటే మాత్రం చర్చ ఫెదరర్ దగ్గరే మొదలై ఫెదరర్ దగ్గరే ఆగిపోతుంది. వివాదానికి తావే లేదు. బోర్గ్, ఎమర్సన్, సంప్రాస్, నాదల్, జకోవిచ్ లాంటి స్టార్లు పోటీలో వెనుకే. తన కళాత్మక ఆటతో, హుందాతనంతో అభిమానుల మనసులపై అంత బలమైన ముద్ర వేశాడు రోజర్. దూకుడుకు అందాన్ని జోడించిన అతడి ఆటను చూడడానికి రెండు కళ్లూ చాలవు.
ఫెదరర్ ఓ చిత్రకారుడే..
కోర్టులో ఫెదరర్ ఓ చిత్రకారుడే. అంత అందంగా ఉంటుంది అతడు కదిలేతీరు. కనులకు ఇంపైన ఆటతో దాదాపు పాతికేళ్లు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించాడు ఫెదరర్. వేగం, నియంత్రణ, సహనం, చురుకుదనం.. ఇలా స్విస్ యోధుణ్ని దిగ్గజాన్ని చేసిన లక్షణాలెన్నో. అందరూ ఆడే షాట్లే అయినా ప్రతి షాట్లోనూ తనదైన శైలిని చొప్పించాడతడు. ఏ షాట్ అయినా అలవోకగా ఆడగల సామర్థ్యం అతడి సొంతం.
అయితే ఫెదరర్ అమ్ములపొదిలో ఎన్నో అస్త్రాలున్నా ముందు గుర్తొచ్చేది అతడి అద్వియతీమైన ఫోర్ హ్యాండే. ఏ పాత చిత్రాన్నో చూడండి ఫెదరర్ ఫోర్ హ్యాండ్‌తో మంత్ర ముగ్దుల్ని చేస్తూ కనిపిస్తాడు. ఏ పాత వీడియోనో చూడండి ఆ అనుభూతి రెట్టింపవుతుంది. చిరుతలా కదిలి ఎంత కచ్చితంగా, అలవోకగా షాట్ కొడతాడో! ప్రత్యర్థులు బెంబేలెత్తాల్సిందే. అతడి ఫోర్ హ్యాండ్ క్రాస్ కోర్టు షాటూ అంతే. అలా ఎన్నో విన్నర్లు కొట్టాడు.