తెలంగాణ

telangana

ETV Bharat / sports

బెల్జియం ఔట్‌.. అవకాశాలు వచ్చినా.. గెలిచినా ఇంటికే..

ఓ అగ్ర జట్టు కథ ముగిసింది. గత ప్రపంచకప్‌లో మూడో స్థానంలో నిలిచిన ప్రపంచ నంబర్‌-2 బెల్జియం ఈసారి గ్రూప్‌ దశనే దాటలేకపోయింది. మరోవైపు అసలు అర్జెంటీనా నాకౌట్‌కు చేరుతుందా..? తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో కంగుతిన్నాక మాజీ ఛాంపియన్‌పై ఇలాంటి అనుమానాలెన్నో..!

telugu-news/sports/general
ఆటగాళ్లు

By

Published : Dec 2, 2022, 6:50 AM IST

Updated : Dec 2, 2022, 9:03 AM IST

ఓ అగ్ర జట్టు కథ ముగిసింది. గత ప్రపంచకప్‌లో మూడో స్థానంలో నిలిచిన ప్రపంచ నంబర్‌-2 బెల్జియం ఈసారి గ్రూప్‌ దశనే దాటలేకపోయింది. ముందంజ వేయాలంటే తప్పక నెగ్గాల్సిన తన చివరి మ్యాచ్‌లో క్రొయేషియాతో 0-0 డ్రా చేసుకున్న ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. లుకాకు మంచి అవకాశాలను చేజార్చడం బెల్జియంను దెబ్బతీసింది. గ్రూప్‌-ఎఫ్‌ నుంచి రెండో స్థానంతో క్రొయేషియా నాకౌట్లో ప్రవేశించింది. కెనడాపై గెలిచిన మొరాకో ఈ గ్రూపులో అగ్రస్థానంతో ముందుకెళ్లింది.

లుకాకు విఫలమైన వేళ

గత టోర్నీ రన్నరప్‌ క్రొయేషియా ప్రపంచకప్‌ నాకౌట్‌కు దూసుకెళ్లింది. గురువారం బెల్జియంతో మ్యాచ్‌ను గోల్‌ లేని డ్రాగా ముగించిన ఆ జట్టు అయిదు పాయింట్లతో గ్రూప్‌-ఎఫ్‌ లో రెండో స్థానంలో నిలిచింది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో విఫలమైన బెల్జియం నాలుగు పాయింట్లతో నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన కెనడా గ్రూపులో అట్టడుగు స్థానంతో టోర్నీని వీడింది. మొరాకో ఏడు పాయింట్లతో గ్రూపులో మొదటి స్థానం సాధించింది.

బెల్జియంకు అవకాశాలు వచ్చినా..
క్రొయేషియాకు డ్రా చేసుకున్నా ముందంజ వేసే అవకాశమున్న నేపథ్యంలో మ్యాచ్‌లో ఎక్కువ ఒత్తిడి బెల్జియంపైనే. రెండు జట్లు దాదాపు సమానంగా బంతిని నియంత్రించాయి. మ్యాచ్‌ మొదలైన పది సెకన్లలో క్రొయేషియా గోల్‌ కొట్టినంత పని చేసింది. అయితే పెరిసిచ్‌ కుడి కాలితో ఆడిన షాట్‌ కుడి పోస్ట్‌కు కాస్త దూరం నుంచి వెళ్లింది. పదో నిమిషంలో బెల్జియం ఆటగాడు కరాస్కో ప్రయత్నాన్ని క్రొయేషియా రక్షణ శ్రేణి అడ్డుకుంది. కాసేపట్లోనే బెల్జియంకు షాక్‌. క్రొయేషియా ఆధిక్యం సాధించినట్లేనని అనుకున్నారంతా. బెల్జియం బాక్స్‌లో క్రమరిచ్‌ను కరాస్కో పడేయడంతో క్రొయేషియాకు రిఫరీ పెనాల్టీ ఇచ్చాడు.

కానీ అది ఆఫ్‌సైడ్‌ అని వీఏఆర్‌ (వీడియో అసిస్టెంట్‌ రిఫరీ)లో తేలడంతో క్రొయేషియాకు పెనాల్టీ దక్కలేదు. అయితే ప్రథమార్థం చివర్లో ఆ జట్టే ఎక్కువ దూకుడు ప్రదర్శించింది. ప్రమాదకరంగా కనిపించింది. బెల్జియం నెమ్మదించింది. 45వ నిమిషంలో క్రమరిచ్‌ షాట్‌ బెల్జియం ఎడమ పోస్ట్‌ నుంచి దూరంగా వెళ్లింది. ద్వితీయార్ధం ఆరంభంలో బెల్జియం మంచి అవకాశం సృష్టించుకుంది. కానీ ఫలితం లేకపోయింది. కుడి వైపు నుంచి డిబ్రుయిన్‌ క్రాస్‌ ఇవ్వగా.. లుకాకు దాన్ని తలతో నేరుగా క్రొయేషియా గోల్‌కీపర్‌ చేతుల్లోకి కొట్టాడు.

61వ నిమిషంలో లుకాకు ఓ సువర్ణావకాశాన్ని వృథా చేశాడు. డిబ్రుయిన్‌ క్రొయేషియా మిడ్‌ఫీల్డ్‌లోని ఖాళీల్లో నుంచి కరాస్కోకు బంతినివ్వగా.. అతడు క్రొయేషియా ఆటగాళ్లను తప్పించుకుంటూ వెళ్లి ఆడిన షాట్‌ను జురనోవిచ్‌ గొప్పగా అడ్డుకున్నాడు. రీబౌండ్‌ లుకాకుకు చక్కగా దొరికింది. అలవోకగా గోల్‌ కొట్టే అవకాశమది. కానీ లుకాకు కుడి కాలితో ఆడిన షాట్‌ పోస్టుకు తగిలింది. గోల్‌ కోసం ప్రయత్నాలు కొనసాగించిన బెల్జియం చివరి అయిదు నిమిషాల్లో, ఇంజురీ సమయంలో మంచి అవకాశాలు సృష్టించుకున్నా ఫలితం లేపోయింది. లుకాకు అవకాశాలను వృథా చేశాడు. 87వ నిమిషంలో కేవలం 4 గజాల దూరం నుంచి అతడు గోల్‌ కొట్టలేపోయాడు.

గెలిచినా ఇంటికే..
దురదృష్టమంటే మెక్సికోదే. గ్రూప్‌లో చివరి మ్యాచ్‌లో ఆ జట్టు 2-1తో సౌదీ అరేబియాపై గెలిచినా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించక తప్పలేదు. గోల్‌ అంతరం కారణంగా గ్రూప్‌లో మూడో స్థానానికే పరిమితమైంది. మరో గోల్‌ చేసినా లేదా ప్రత్యర్థికి గోల్‌ సమర్పించుకోకున్నా ఆ జట్టు ముందంజ వేసేది. 1978 తర్వాత ఆ జట్టు నాకౌట్‌ చేరకపోవడం ఇదే తొలిసారి. గత ఏడు ప్రపంచకప్‌ల్లోనూ ఆ జట్టు గ్రూప్‌ దశ దాటింది. మెక్సికో తొలి అర్ధభాగంలో ప్రత్యర్థి రక్షణశ్రేణిని ఛేదించలేకపోయింది. ద్వితీయార్ధం ఆరంభంలోనే కార్నర్‌ కిక్‌ను గోల్‌పోస్టు దగ్గరే మాటు వేసిన మార్టిన్‌ (47వ) నెట్‌లోపలికి పంపించి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత అయిదు నిమిషాలకే చవెజ్‌ (52వ) ఫ్రీకిక్‌ను 30 గజాల దూరం నుంచి కళ్లుచెదిరే రీతిలో నేరుగా గోల్‌పోస్టులోకి పంపించాడు.

అక్కడి నుంచి మెక్సికో దాడులు పెంచింది. కానీ ప్రత్యర్థి గోల్‌కీపర్‌ వాటిని సమర్థంగా అడ్డుకున్నాడు. 73వ నిమిషంలో చవెజ్‌ మరో ఫ్రీకిక్‌ను గోల్‌గా మలచలేకపోయాడు. నిర్ణీత సమయం ముగిసింది. 2-0తో గెలిచి మెక్సికో నాకౌట్‌ చేరుతుందనిపించింది. కానీ అదనపు సమయంలో సలెమ్‌ (90+5వ) గోల్‌ కొట్టి ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో కన్నీళ్లతో మెక్సికో ఆటగాళ్లు మైదానం వీడారు.

అర్జెంటీనావచ్చేసింది..
అసలు అర్జెంటీనా నాకౌట్‌కు చేరుతుందా..? తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో కంగుతిన్నాక మాజీ ఛాంపియన్‌పై ఇలాంటి అనుమానాలెన్నో..! వాటిని పటాపంచలు చేస్తూ.. సామర్థ్యంతో సందేహాలకు సమాధానాలు ఇస్తూ.. మెస్సి సేన ముందంజ వేసింది. గ్రూప్‌-సి నుంచి అగ్రస్థానంతో ప్రపంచకప్‌లో ప్రి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. అర్జెంటీనా చేతిలో ఓడినా.. రెండో స్థానంతో పోలెండ్‌ కూడా నాకౌట్‌లో అడుగుపెట్టింది. 1986 తర్వాత తొలిసారి ఆ జట్టు గ్రూప్‌ దాటింది. మెక్సికో, సౌదీ అరేబియా కథ ముగిసింది.

కల దిశగా..
అర్జెంటీనా తొలి విఘ్నాన్ని దాటింది. నాకౌట్లో అడుగుపెట్టింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2-0 తేడాతో పోలెండ్‌పై గెలిచింది. అలిస్టర్‌ (46వ నిమిషంలో), అల్వరెజ్‌ (67వ) చెరో గోల్‌ కొట్టారు. మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఓ ఓటమితో 6 పాయింట్లతో మెస్సి జట్టు గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓడినా మెరుగైన గోల్స్‌ అంతరం కారణంగా మెక్సికో (-1)ను వెనక్కినెట్టి పోలెండ్‌ (0) రెండో స్థానంతో ముందంజ వేసింది. ఈ రెండు జట్లూ ఒక్కో గెలుపు, ఓటమి, డ్రా నమోదు చేశాయి. పోలెండ్‌తో పోరులో ఆరంభం నుంచే అర్జెంటీనా దూకుడుగా ఆడింది. మ్యాచ్‌లో 67 శాతం బంతి తమ నియంత్రణలోనే ఉంచుకుని, గోల్‌పోస్టుపై సూటిగా 13 సార్లు అర్జెంటీనా దాడి చేసినా.. రెండు సార్లు మాత్రమే సఫలమైంది. బలమైన పోలెండ్‌ రక్షణశ్రేణి అందుకు కారణం. ముఖ్యంగా గోల్‌కీపర్‌ వోయ్‌చెక్‌ షుటెస్నీ అడ్డుగోడలా నిలబడి ఆ జట్టు ఆశలు నిలిపాడు.

అల్వరెజ్ గోల్

పదో నిమిషంలో మెస్సి తన్నిన బంతిని అతను అడ్డుకున్నాడు. కొద్దిసేపటికే మార్కస్‌ బంతి గోల్‌పోస్టు పక్కనుంచి వెళ్లింది. 39వ నిమిషంలో పెనాల్టీ అవకాశాన్ని మెస్సి వృథా చేశాడు. కుడి వైపు అతని కిక్‌ను.. తన ఎడమ వైపు డైవ్‌ చేస్తూ కుడి చేతితో వోయ్‌చెక్‌ గొప్పగా ఆపాడు. విరామం తర్వాత అర్జెంటీనా వేగం పెంచింది. మొలీనా నుంచి పాస్‌ అందుకున్న అలిస్టర్‌ ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించి జట్టు ఖాతా తెరిచాడు. కొద్దిసేపటికే ప్రత్యర్థి పెనాల్టీ ప్రదేశంలో డిఫెండర్లను తప్పించి అల్వరెజ్‌ గోల్‌తో జట్టు ఆనందాన్ని రెట్టింపు చేశాడు. ఆ తర్వాత కూడా గోల్స్‌ కోసం అర్జెంటీనా ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేకపోయింది. మరోవైపు మెక్సికో, సౌదీ అరేబియా మ్యాచ్‌ ఫలితం తెలిసిన తర్వాత పోలెండ్‌ ఆటగాళ్లు మైదానంలో సంబరాలు చేసుకున్నారు. నాకౌట్‌లో ఆస్ట్రేలియాతో అర్జెంటీనా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌తో పోలెండ్‌ తలపడతాయి.

Last Updated : Dec 2, 2022, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details