ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగే జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం.. కరోనా ప్రభావంతో ఈసారి వర్చువల్ పద్ధతిలో నిర్వహించనున్నారు. అవార్డు గ్రహీతలు వారి స్వస్థలాల నుంచే ఆన్లైన్ ద్వారా కార్యక్రమంలో పాల్గొనున్నారు.
స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వరించింది. ఇతడితో పాటే పారా అథ్లెట్ మరియప్పన్ తంగవేలు, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ మనిక బత్రా, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ ఈ జాబితాలో ఉన్నారు. మరో 27 మంది అర్జున అవార్డును అందుకోనున్నారు. ద్రోణాచార్య అవార్డుకు 13 మంది కోచ్‌ల పేర్లను సిఫార్సు చేశారు.
ఖేల్ రత్న, అర్జున అవార్డులు సాధించిన క్రీడాకారులు ఖేల్‌రత్న గ్రహీతలకు ప్రస్తుతం రూ.7.5 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నారు. అర్డున, ద్రోణాచార్య పురస్కార గ్రహీతలకు రూ.5 లక్షల చొప్పన లభిస్తాయి. ఈ సారి మాత్రం నగదు బహుమతిని భారీగా పెంచాలని క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపితే.. ఖేల్‌రత్న గ్రహీతలకు రూ.25 లక్షలు, అర్జున అవార్డు విజేతలకు రూ.15 లక్షలు ఇవ్వనున్నరు. ఈ క్రమంలోనే అసలు ఈ అవార్డుల ఇచ్చేందుకు క్రీడాకారులను ఎలా ఎంపిక చేస్తారు? ఏ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుంటారు?
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు
నిబంధనల ప్రకారం.. ఒలింపిక్, పారా ఒలింపిక్ పతక విజేతలు నేరుగా ఖేల్ రత్న అవార్డు నామినేషన్‌కు అర్హత సాధిస్తారు. వీరు కాకుండా, ఇతర క్రీకాడాకులకు ప్రపంచ ఛాంపియన్షిప్ పాయింట్ల లెక్కింపు/ప్రపంచకప్‌లు(నాలుగేళ్లకు ఒకసారి)- బంగారు పతకం(40 పాయింట్లు), రజతం(30), కాంస్య పతకం(20) చొప్పున అర్హతలుగా పరిగణిస్తారు. ఆసియా క్రీడల్లో 30, 25, 20 పాయింట్లు.. కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ ఛాంపియన్షిప్, ప్రపంచ కప్(వార్షిక)ల్లో 25, 20, 15 పాయింట్లు కలిగి ఉండాలి. ఆసియా ఛాంపియన్షిప్ అండ్ కామన్వెల్త్ గేమ్స్‌లో 15, 10, 7 పాయింట్లు పొందిన వారినీ పరిగణలోకి తీసుకుంటారు.
అర్జున అవార్డు
భారత ప్రభుత్వం 1961లో అర్జున అవార్డును క్రీడాకారులకు ఇవ్వడం ప్రారంభించింది. ఈ పురస్కార గ్రహీతలకు నగదు బహుమతితో పాటు అర్డునుడి కాంస్య విగ్రహం, పతకం అందజేస్తారు. ఇటీవలే క్రీడా మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించింది. గతంలో నాలుగేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా ప్రదర్శిస్తున్న క్రీడాకారులు ఈ అవార్డుకు అర్హులుగా పేర్కొంది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. క్రీడా నైపుణ్యంతో పాటు, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ కూడా కలిగి ఉండాలని సూచించింది.