ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. బుధవారం వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షించారు. అయితే ఆటలు ఆడే క్రమంలో ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని సూచించారు మోదీ. 'క్యూ పడే హో చక్కర్ మే.. కోయీ నహీ హై టక్కర్ మే' అనే సక్సెస్ మంత్రతో ముందుకు సాగాలన్నారు. భారత క్రీడా చరిత్రలోనే.. ఈ కాలం చాలా కీలకమైందన్నారు ప్రధాని మోదీ.
" భారత క్రీడా చరిత్రలో.. ఇది చాలా ముఖ్యమైన కాలం. మీలాంటి చాలామంది క్రీడాకారులు స్ఫూర్తిని నింపుతున్నారు. శిక్షణ కూడా చాలా మెరుగవుతోంది. క్రీడల పట్ల చాలా మంది ఆసక్తిని కనబరుస్తున్నారు. కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారు."
-ప్రధాని మోదీ.
కామన్వెల్త్ గేమ్స్ ఆడటానికి వెళ్తున్న వారిలో చాలా మంది ఇప్పటికే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఉంటారని, అయితే తొలిసారి వెళ్తున్న వారికి తన తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మోదీ పేర్కొన్నారు. మొదటిసారిగా పాల్గొనబోతున్న 65 మంది అథ్లెట్లు.. క్రీడా ప్రపంచంలో తమదైన ముద్రవేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరో 10 రోజుల్లో ప్రపంచ వేదికపై భారతీయ అథ్లెట్ల మెరుపులను అందరం చూస్తామన్నారు. మనసు పెట్టి ఆడితే విజయం మీదే అని చెప్పారు మోదీ.
"మీరు ఎలా ఆడాలనే విషయంలో నేను చెప్పేది ఒక్కటే. మనసు పెట్టి ఆడండి. మీ పూర్తి శక్తిని వినియోగించి.. ఎలాంటి టెన్షన్ లేకుండా ఆడండి."