తెలంగాణ

telangana

By

Published : Jan 26, 2020, 5:34 PM IST

Updated : Feb 25, 2020, 5:00 PM IST

ETV Bharat / sports

ఒలింపిక్స్​లో స్వర్ణం గెలిస్తే.. భారత రత్నమేనా..?

భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాల్లో రెండోది 'పద్మ విభూషణ్'​. తాజాగా ఈ అవార్డు ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్​, మణిపురి బాక్సర్​ మేరీకోమ్​ను వరించింది. అవార్డు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన ఈ స్టార్​ క్రీడాకారిణి.. సచిన్​ను స్ఫూర్తిగా చెబుతూ ఓ ఆసక్తికర అభిప్రాయం వ్యక్తం చేసింది.

Padma Vibhushan Mary Kom dreams of winning Bharat Ratna after win Olympic Gold at Tokyo 2020
ఒలింపిక్స్​లో స్వర్ణం గెలిస్తే.. భారత రత్నమేనా..?

భారత మహిళా బాక్సర్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడటాన్నే గొప్పగా భావించేవాళ్లు ఒకప్పుడు. అలాంటిది ఆ ప్రతిష్టాత్మక టోర్నీలో మణిపుర్‌ ఉక్కు మహిళ మేరీకోమ్‌ అరడజనుసార్లు ఛాంపియన్‌గా నిలవడం ఊహకైనా అందని విషయం. అందుకే క్రీడల్లో ఆమె చూపించిన ప్రతిభకు గానూ.. భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో రెండోదైన పద్మ విభూషణ్​ను ప్రకటించింది కేంద్రం. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది మేరీ. తాజాగా ఈ అవార్డు రావడంపై స్పందించింది మేరీ.

" ఈ అవార్డు(పద్మవిభూషణ్​) రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ స్ఫూర్తి కొనసాగిస్తూ భారతరత్న కూడా అందుకోవడానికి ప్రయత్నిస్తా. ఆ పతకమే నా లక్ష్యం. ఇప్పటివరకు క్రీడల్లో ఈ అత్యున్నత పురస్కారాన్ని దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​ మాత్రమే అందుకున్నారు. నేనూ ఆయన బాటలోనే నడిచి తొలి మహిళగా నిలవాలని అనుకుంటున్నా. సచిన్​ నాకు స్ఫూర్తి ".

- మేరీకోమ్​, భారత బాక్సర్​

ప్రస్తుతం ఒలింపిక్స్​ కోసం తీవ్రంగా సాధన చేస్తున్నట్లు చెప్పింది మేరీ. ఈ మెగాటోర్నీలో భారత్​కు పసిడి అందించడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని అభిప్రాయపడింది. ఇది సాధిస్తే కచ్చితంగా 'భారతరత్న' అందుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది. దేశం కోసం ఆడటాన్ని గౌరవంగా, గర్వంగా భావిస్తానని చెప్పింది.

మార్చి 3 నుంచి 11 వరకు ఒలింపిక్స్​ అర్హత టోర్నీ జోర్డాన్​లోని అమన్​లో జరగనుంది. ఇందులో మేరీ ప్రదర్శన ఆధారంగా ఒలింపిక్స్​లో బెర్త్​ ఖాయం చేసుకుంటుంది. గతంలో ఫిబ్రవరి 3-14 వరకు చైనాలోని వుహాన్​లో వీటిని నిర్వహించాల్సి ఉన్నా.. కరోనా వైరస్​ కారణంగా వేదిక మార్చారు.

భారత వీర వనిత...

వెనుకబడ్డ ఈశాన్య ప్రాంతంలో పేద కుటుంబంలో పుట్టిన మేరీకోమ్... ఇంత ఘనత సాధిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. 2001లో తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడి కాంస్యం సాధించి ఆశ్చర్యపరిచిన ఆమె.. తర్వాతి ఏడాది ఏకంగా స్వర్ణం సాధించి అబ్బురపరిచింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకున్నది లేదు.

2005, 2006, 2008, 2010 సంవత్సరాల్లోనూ ప్రపంచ ఛాంపియన్‌ అయింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం కూడా నెగ్గిన మేరీ.. ఒక దశలో బాక్సింగ్‌కు దూరమైనట్లే కనిపించింది. కానీ మళ్లీ ఆటలోకి పునరాగమనం చేసి ఇద్దరు బిడ్డలకు తల్లిగా, 34 ఏళ్ల వయసులో మళ్లీ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించింది.

మేరీ 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్‌ అవార్డులు అందుకుంది. 2003లో 'అర్జున'కు ఎంపికైన ఆమె.. 2009లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం 'రాజీవ్‌ ఖేల్‌రత్న' దక్కించుకుంది. మేరీకోమ్‌ టోక్యో విశ్వక్రీడల్లో చివరిగా బరిలోకి దిగనుంది. ఆ తర్వాత సుదీర్ఘ కెరీర్‌కు ఘనంగా ముగింపు పలకాలని భావిస్తోంది.

Last Updated : Feb 25, 2020, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details