భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఒలింపిక్స్‌లో వ్యక్తిగతంగా వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడు.. దేశంలో అతడిని వరించని క్రీడా పురస్కారం లేదు.. ఎంతోమంది యువకులు అతడిని చూసి పహిల్వాన్ అవ్వాలని జిమ్‌లలో చేరారు. అలాంటి వ్యక్తి తన శిష్యుడినే హత్య చేశాడనే ఆరోపణలపై కొన్నాళ్లపాటు పరారయ్యాడు.. అతడిపై పోలీసులు రూ.లక్ష రివార్డు కూడా ప్రకటించారు. ఎట్టకేలకు పోలీసులకు దొరికి జైలుపాలయ్యాడు. అతడే రెజ్లింగ్ ఛాంపియన్ సుశీల్‌కుమార్.
ఇంటి అద్దె గొడవ..
సుశీల్ కుమార్‌కు దిల్లీలోని మోడల్ టౌన్‌లో ఒక ఇల్లు ఉంది. దానిలో రెజ్లర్ సాగర్ కుమార్ ధన్‌కర్ కొన్నాళ్లు అద్దెకు ఉన్నాడు. ఈ క్రమంలో అతను అద్దె సరైన సమయానికి చెల్లించలేదు. దీంతో సుశీల్, అతనికి మధ్య వివాదం జరిగింది. అప్పట్లో సాగర్‌ను ఖాళీ చేయించడానికి సుశీల్ తీవ్రంగా ప్రయత్నించాడు. దీనికి అతడి బంధువు ఆనంద్ అనే వ్యక్తి కూడా సాయం చేశాడు. దీంతో సాగర్ నాలుగు నెలల క్రితం ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే చోటుకు మారిపోయాడు. ఆ తర్వాత నుంచి సుశీల్ కుమార్‌ను సాగర్ అందరి ఎదుట దూషించడం మొదలుపెట్టాడని పోలీసులు పేర్కొన్నారు. దీంతో తన ప్రతిష్ఠ దెబ్బతింటోందని సుశీల్ ఆగ్రహం చెందాడు.
స్టేడియం వద్ద ఘర్షణ..
మే 4వ తేదీ అర్ధరాత్రి ఛెత్రసాల్ స్టేడియం వద్ద సుశీల్, ఆయన బృందం హాకీ బ్యాట్లు, క్రికెట్ బ్యాట్లతో తమపై దాడి చేసిందని క్షతగాత్రుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి సమయంలో సుశీల్ అక్కడే ఉన్నారని చెప్పారు. వారి కార్లలో హాకీ బ్యాట్లు, క్రికెట్ బ్యాట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో స్టేడియంలో అథ్లెట్లు ఉన్నట్లు సమాచారం. దాడి అనంతరం రాత్రి 2 గంటల సమయంలో సుశీల్ కుమారే పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి స్టేడియం వద్ద ఘర్షణ జరిగినట్లు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ఐదుకార్లు ఆపి ఉన్నాయి. వాటిల్లో ఉన్న ఒక స్కార్పియో కారులో తూటాలు నింపి ఉన్న డబుల్ బ్యారెల్ గన్, మూడు కార్ట్రెడ్జ్‌లు దొరికాయి. ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలతో పడిపోయి ఉన్నారు. వారిలో సాగర్ చికిత్స పొందుతూ మరణించాడు. సుశీల్ బృందం చేసిన దాడిలో సోను మోనల్, అమిత్ కుమార్ అనే వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరు సుశీల్ కుమార్ పై ఆరోపణలు చేశారని డీసీపీ జి.ఎస్.సిద్ధు తెలిపారు. ఈ దాడిలో దాదాపు 20 మంది పాల్గొన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ప్రిన్స్ దలాల్ అనే రెజ్లర్‌ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి సుశీల్ పరారీలో ఉన్నాడు. అతడి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.