ప్రపంచ, ఒలింపిక్ ఛాంపియన్ మహిళా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ టోరి బోవి అకస్మాతుగా కన్నుమూసింది. 32 ఏళ్ల ఆమె.. అమెరికా ఫ్లోరిడాలోని తన నివాసంలో విగతజీవిగా పడి ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆమె మరణానికి గల కారణాలను ఇంకా తెలియలేదు. ఈ విషయాన్ని టోరి మేనేజ్మెంట్ కంపెనీ కూడా ధ్రువీకరించింది. "టోరీ బోయి ఇకలేదన్న వార్తను మీకు తెలియజేయడం చాలా బాధగా ఉంది. మేము మంచి ఫ్రెండ్, డాటర్, సిస్టర్ లాంటి అథ్లెట్‌ను కోల్పోయాం" అని మేనేజ్మెంట్ ట్వీట్ చేసింది. అయితే కొంత కాలంగా టోరీ మానసిక ఒత్తిడితో బాధపడుతోందని తెలిసింది. ఆమె మృతి పట్ల అక్కడి పలువురు క్రీడాకారులు సంతాపం తెలుపుతున్నారు.
"మూడు సార్లు ఒలింపిక్ విజేత, రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన టోరి బోవి కన్నుమూయడం చాలా బాధకారమైన విషయం. ఈ విషయాన్ని షేర్ చేయడం ఎంతో బాధగా ఉంది. ఎంతో టాలెంట్ ఉన్న అథ్లెట్. క్రీడల్లో ఆమె అందించిన సేవలు మరవలేనివి. ఎంతో ప్రభావితం చేసింది. ఆమెను మిస్ అవుతున్నాం" అని యూఎస్ఏటీఎఫ్ ఫెడరేషన్ సీఈఓ మ్యాక్స్ సీగల్ సంతాపం వ్యక్తం చేశారు.
కెరీర్ విజయాలు.. 2013లో తన కెరీర్‌ను ప్రారంభించింది టోరి బోవి. 2015 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్లలో బ్రాంజ్ మెడల్ సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో 4x100 మీటర్ల రిలేలో గోల్డ్ మెడల్, 100 మీటర్లలో సిల్వర్ మెడల్, 200 మీటర్లలో బ్రాంజ్ మెడల్‌ను ముద్దాడింది. 2017లో లండన్‌లో జరిగిన ఐఏఏఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకుంది. అలానే అమెరికా తరఫున 4x100 మీటర్ల రిలే విభాగంలో గోల్డ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2011 నుంచి అథ్లెట్ కార్మెలిటా జెటెర్ తర్వాత ఒలింపిక్, వరల్డ్ 100 మీటర్ల టైటిల్ గెలిచిన రెండో అమెరికన్ మహిళ టోరీనే కావడం విశేషం.
లాంగ్‌జంప్‌లో నాలుగో స్థానం.. డైమండ్ లీగ్ మీట్లో నాలుగుసార్లు 100 మీటర్లలో, నాలుగుసార్లు 200 మీటర్లలో గోల్డ్ మెడల్స్‌ను ముద్దాడింది టోరి. 2019లో దోహా వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి.. 100 మీటర్ల విభాగంలో సెమీఫైనల్‌కు చేరింది. కానీ ఆమె సెమీఫైనల్ రేసులో పోటీపడలేదు. ఈ మెగా ఈవెంట్లో ఆమె లాంగ్‌జంప్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మళ్లీ మరో అంతర్జాతీయ ఈవెంట్లో పోటీపడలేదు.
ఇదీ చూడండి:రెజ్లర్లు-పోలీసుల మధ్య అర్ధరాత్రి ఘర్షణ.. గాయపడిన బజరంగ్, వినేశ్ ఫొగాట్