పటియాలలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో 46 మంది ప్రముఖ అథ్లెట్లు ప్రతిష్టాత్మక డిప్లొమా కోర్సులకు ప్రత్యక్ష ప్రవేశం పొందారని సాయ్ ప్రకటించింది. ప్రఖ్యాత అథ్లెట్లతో పాటు మరికొంత మంది శిక్షణ పొందటానికి ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నట్లు సాయ్ తెలిపింది. ఈ కోర్సుల్లో చేరడానికి కావాల్సిన అర్హతలను మే నెలలో విడుదల చేసింది. అయితే ఎక్కువ మంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకుగానూ కొన్ని నిబంధనలను సడలించి దరఖాస్తు దారులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తామని సాయ్ తాజా ప్రకటనలో పేర్కొంది.
వారూ అర్హులే..
"ఎన్ఐఎస్లో చేరదలచిన సీనియర్ క్రీడాకారులు కచ్చితంగా అంతర్జాతీయ వేదిక మీద పతకం సాధించి ఉండాలని గతంలో ప్రకటించాం. కానీ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్నవారూ దీనికి అర్హులే. ఆసియా, కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన వారే కాకుండా పతకమేదైనా పొంది ఉన్నా దీనికి అర్హులని తాజాగా నిర్ణయించాం. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్ షిప్లో పాల్గొన్న ప్రముఖ క్రీడాకారులు నేరుగా ఈ కోర్సులో చేరడానికి అనుమతిస్తున్నాం" అని సాయ్ తాజా ప్రకటనలో వెల్లడించింది.
దరఖాస్తు గడువు పొడిగింపు
ఎన్ఐఎస్ నిర్వహించే కోర్సులకు దేశంలోని 23 క్రీడల నుంచి 46 మందిని (ఒక క్రీడాకారుడు, ఒక క్రీడాకారిణి) ఎంపిక చేశారు. వీరందరూ ఆన్లైన్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదని సాయ్ వెల్లడించింది. ఒకవేళ ఇద్దరు ప్రముఖ అథ్లెట్లు ఒకే విభాగాన్ని ఎంచుకుంటే వారిద్దరి పాయింట్లను పోల్చి వారిలో ఉత్తమ ఆటగాళ్లను ఎంచుకుంటామని తెలిపింది. ఈ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిన తేదీని జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.