Messi Vs Ronaldo : ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో గత రెండు దశాబ్దాల్లో ఆట పరంగా చూసినా.. ఆకర్షణ పరంగా చూసినా లియొనల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో లకు సాటి వచ్చే ఆటగాళ్లును మనం చూసుండం. కిలియన్ ఎంబాపె, నెయ్‌మార్ జూనియర్.. ఇలా ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ దూసుకొచ్చినా.. ఈ ఇద్దరి స్థాయిని అందుకోలేకపోయారు. వయసు పెరిగినా వన్నె తగ్గని ఆట, ఆకర్షణ వారిది. అయితే వీళ్లిద్దరిలో ఎవరు గొప్ప? అనే చర్చ ఇప్పటిది కాదు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లోనే కాక క్లబ్ ఫుట్‌బాల్‌లో ఎవరికి వారే అన్నట్లు సాగిపోతుండేది ఈ జంట. చాలా ఏళ్ల పాటు పోటాపోటీగా సాగిపోయిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు భిన్నమైన ఆటను ప్రదర్శిస్తున్నారు. మరోవైపు మెస్సి తిరుగులేని ఆధిపత్యంతో 'మోడర్న్ ఆల్ టైం గ్రేట్' కిరీటాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.
ఏటా ప్రపంచ ఉత్యుత్తమ ఫుట్‌బాలర్ ఎవరో తేల్చే పురస్కారం బాలెన్ డోర్. దీన్ని అందుకోవడాన్ని ఫుట్‌బాలర్లు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. అంతర్జాతీయ ప్రదర్శనతో పాటు క్లబ్ ఫుట్‌బాల్‌లో ఆటను కూడా దీనికి ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే ఈ పురస్కారాన్ని రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి అందుకుని చరిత్ర సృష్టించాడు లియోనల్ మెస్సి. చరిత్రలో మరే ఆటగాడూ ఇన్నిసార్లు ఈ పురస్కారాన్ని అందుకోలేదు. 2017లో అతను, రొనాల్డో అయిదేసి అవార్డులతో సమానంగా ఉండేవారు. అప్పుడు వారి ప్రదర్శన నువ్వా నేనా అన్నట్లుగా సాగేది. ఇక అవార్డులే కాక వివిధ అంశాల్లోనూ ఎవరికి వారే సాటి అన్నట్లుగా ఆడేవాళ్లు. కానీ గత ఐదేళ్లలో పరిస్థితి మొత్తం మారిపోయింది.
రొనాల్డో కన్నా మూడు బాలెన్ డోర్ పురస్కారాలు ఎక్కువ గెలుచుకున్నాడు మెస్సి. ఇప్పుట్లో అయితే రొనాల్డో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు విషయంలో మెస్సిని అధిగమించే అవకాశాలు కనిపించడం లేదు. ఈసారి ఈ అవార్డు విషయంలోనూ రొనాల్డో ఎంతగా వెనుకబడ్డాడంటే.. అతను కనీసం టాప్-10లో కూడా నిలవలేకపోయాడు. అంతకంటే ముందు షార్ట్ లిస్ట్ చేసిన 30 మందిలో కూడా రొనాల్డో లేనే లేడు. అంటే బాలెన్‌డోర్ పురస్కారం దరిదాపుల్లో కూడా ఈ దిగ్గజ ప్లేయర్ లేడు. ఈ ఏడాది క్లబ్ ఫుట్‌బాల్‌లో మెస్సి 17 గోల్స్ సాధిస్తే.. రొనాల్డో మాత్రం 11కు పరిమితం అయ్యాడు. ఎర్లింగ్ హాలండ్ 52 గోల్స్‌తో రొనాల్డోకు పోటీ ఇచ్చినప్పటికీ.. అంతర్జాతీయ ప్రదర్శనను కూడా దృష్టిలో ఉంచుకుని మెస్సిని విజేతగా ప్రకటించారు.