దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. పలువురు భారత బాక్సర్లు ఫైనల్స్ బరిలో నిలిచారు. స్వర్ణ పతకమే లక్ష్యంగా చివరి పోరులోనూ గెలవాలని భావిస్తున్నారు.
ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ బాక్సింగ్ పోటీల ఫైనల్స్‌కు చేరింది. 51 కేజీల విభాగంలో కజకిస్థాన్ బాక్సర్ నాజీమ్ కైజాయ్తో తలపడనుంది. ఇప్పటికే ఈ పోటీల్లో ఐదు సార్లు బంగారు పతకాలు గెలిచిన మేరీ.. మరో గోల్డ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకోవాలని యోచిస్తోంది.
గురువారం జరిగిన సెమీస్‌లో మంగోలియా బాక్సర్ లుట్సైఖాన్ అల్తాంట్సెట్సెగ్పై 4-1 తేడాతో గెలిచి ఊపుమీదుంది మేరీ. ఇక తుది పోరులో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయినా కైజాయ్ వంటి గట్టి ప్రత్యర్థితో పోరుకు సై అంటోంది.
మేరీ కోమ్‌తో పాటు బాక్సర్లు పూజా రాణి, అనుపమ, లాల్బుత్సాహిలు ఆదివారం జరిగే ఫైనల్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.