32వ ఒలింపిక్ గేమ్స్ శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జపాన్ చక్రవర్తి నరుహిటోతో పాటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ విశ్వక్రీడలను ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన వేడుకల్లో భాగంగా.. టోక్యో గడ్డ మీద మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.
ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొనే దేశాల క్రీడాకారులు పరేడ్ నిర్వహించడం అనవాయితీ. అయితే ఈ పరేడ్‌లో ఆధునిక ఒలింపిక్స్ పుట్టిన దేశమైన గ్రీస్ బృందం వరుసలో ముందు ఉంది. ఆ తర్వాత జపాన్ భాషలో అల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం టీమ్స్ పరేడ్‌లో పాల్గొన్నాయి. ఈ పరేడ్‌లో భారత్ తరఫున 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు పాల్గొన్నారు. ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్, హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ మన జాతీయ జెండాతో బృందాన్ని ముందుండి నడిపించారు.