FIFA World Cup France Golden Goal: 1998 ప్రపంచకప్‌లో తొలిసారి గోల్డెన్‌గోల్ నిబంధన ప్రవేశపెట్టారు. ఫ్రాన్స్ ఈ నిబంధనను అద్భుతంగా అందిపుచ్చుకొని ఏకంగా ప్రపంచకప్‌నే ఒడిసిపట్టింది. మ్యాచ్ సమయంలో ఇరుపక్షాలు సమ ఉజ్జీలుగా ఉంటే.. రెండు సార్లు 15 నిమిషాల చొప్పున సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో ఎవరు ముందు గోల్ కొడితే వారిని విజేతగా ప్రకటిస్తూ మ్యాచ్‌ను తక్షణమే ముగించేసేవారు. ఈ గోల్‌ను 'గోల్డెన్ గోల్'గా వ్యవహరిస్తారు.
ఫ్రాన్స్ చరిత్రను తిరగరాసిన ఫస్ట్ 'గోల్డెన్ గోల్'.. తొలిసారి వరల్డ్‌కప్‌ను అందించి.. - first golden goal in fifa world cup
గోల్డెన్ గోల్ నిబంధన ఫ్రాన్స్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించింది. అత్యంత కఠినంగా సాగిన తొలి నాకౌట్ మ్యాచ్‌ను ఈ నిబంధన సాయంతో ఆ దేశం గెలుచుకొంది. ఆ గోల్డెన్ గోల్ కోసమే ఈ కథనం..
1998 ప్రపంచకప్‌లో నాకౌట్ దశ అయిన 'రౌండ్ ఆఫ్ 16'లో ఫ్రాన్స్-పరాగ్వే మధ్య జూన్ 28న పోరు జరిగింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. కానీ, పరాగ్వే జట్టు గోల్‌పోస్టుకు గోడకట్టినట్లు రక్షణను ఏర్పాటు చేసింది. దీనిని మ్యాచ్ సమయంలో ఛేదించడం ఫ్రాన్స్ ఆటగాళ్ల వల్లకాలేదు. కానీ, నాకౌట్ దశ కావడంతో విజేతను నిర్ణయించడం తప్పనిసరి. దీంతో అదనపు సమయం కేటాయించాల్సి వచ్చింది.
అప్పుడు కూడా హోరాహోరీ పోరు తప్పలేదు. తొలి అదనపు 15 నిమిషాల్లో గోల్ కాలేదు. చివరికి మ్యాచ్ 115వ నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు లారెంట్ బ్లాంక్ పరాగ్వే రక్షణ వలయాన్ని ఛేదించుకొంటూ ప్రపంచకప్‌ల చరిత్రలోనే తొలి గోల్డెన్ గోల్ చేశాడు. ఈ గోల్ సాయంతో ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్ చేరుకొంది. ఆ తర్వాత ఫ్రాన్స్ ఫుట్‌బాల్ చరిత్రలో తొలి ప్రపంచకప్‌ను అందుకొంది. గోల్డెన్‌గోల్ నిబంధనను 1998, 2002 ప్రపంచకప్‌ల్లో మాత్రమే వినియోగించారు. 2006 ప్రపంచకప్ నుంచి నిబంధనలు మార్చారు. ప్రస్తుతం నిబంధన ప్రకారం అదనంగా కేటాయించిన 30 నిమిషాలను పూర్తిగా ఆడాల్సిందే. గోల్ కొట్టగానే ఆట ముగియదు. రౌండ్ ఆఫ్ 16, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, థర్డ్ ప్లేస్ మ్యాచ్‌కు ఇది వర్తిస్తుంది.