పునరాగమనంలో కోనేరు హంపి నుంచి అద్భుత ప్రదర్శన! ఇటీవలే మొనాకో గ్రాండ్‌ప్రి చెస్ టైటిల్ గెలుచుకున్న హంపి మరో మెగా టైటిల్ ఖాతాలో వేసుకుంది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఆమె పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 12 రౌండ్ల ఈ టోర్నీలో ఆఖరి రౌండ్ తర్వాత హంపి 9 పాయింట్లతో చైనా గ్రాండ్‌మాస్టర్ లీ టింగ్‌జీ, ఎక్తరీనా (టర్కీ)తో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా స్వర్ణం కోసం పోరాడే అవకాశం హంపి, లీ టింగ్‌జీలకు దక్కింది. ప్లేఆఫ్స్ కూడా అంత త్వరగా తేలలేదు. హంపి, లీ టింగ్‌జీ హోరాహోరీ పోరాడడంతో తొలి ప్లేఆఫ్స్ కూడా డ్రాగా ముగిసింది. దీంతో రెండో ప్లేఆఫ్స్ అనివార్యమైంది. రెండో ప్లేఆఫ్స్‌లో హంపి దూకుడుగా ఆడింది. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా.. తప్పులు చేయకుండా పావులు కదిపింది. ఆఖర్లో తన బలగాలను పణంగా పెడుతూ ప్రత్యర్థి రాజును ముట్టడించింది. దీంతో ఈసారి లీ టింగ్‌జీ ఓటమి ఒప్పుకోక తప్పలేదు.
ప్రపంచ ర్యాపిడ్ ఛాంప్ కోనేరు హంపి - news on World Rapid Chess Tournament
తెలుగమ్మాయి, చదరంగ ధ్రువతార కోనేరు హంపి ప్రపంచ వేదికపై మరో అద్భుత విజయం సాధించింది. ఆమె తొలిసారి ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలిచింది. శనివారం ముగిసిన ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె.. ప్లేఆఫ్స్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్ లీ టింగ్‌జీని ఓడించి టైటిల్ అందుకుంది. 2015లో మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, ఈ ఏడాది ఫిడె మహిళల గ్రాండ్‌ప్రిలో స్వర్ణం సాధించిన హంపికి.. ఇదే తొలి ప్రపంచ టైటిల్. భారత్ తరఫున మహిళల విభాగంలోనూ ఇదే తొలి ప్రపంచ టైటిల్ కావడం విశేషం.
మరో గ్రాండ్‌మాస్టర్ ఎక్తరీనా కాంస్య పతకంతో సంతృప్తి పడింది. అంతకుముందు ర్యాపిడ్ చివరి రౌండ్లో హంపి.. జోంగ్‌యి (చైనా)ను ఓడించగా, అప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న లీ టింగ్ జీ.. ఎక్తరీనా చేతిలో ఓడిపోవడంతో పోటీ రసవత్తరంగా మారింది. మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 8 పాయింట్లతో ఉమ్మడిగా ఐదో స్థానంలో నిలిచింది. చివరి రౌండ్లో ఎలిజిబెత్ (జర్మనీ)పై హారిక విజయం సాధించింది. పురుషుల ర్యాపిడ్ విభాగంలో మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) టైటిల్ సాధించాడు. 11 పాయింట్లతో కార్ల్‌సన్ అగ్రస్థానంలో నిలవగా, నకముర (10, అమెరికా), వ్లాదిస్లావ్ (10, రష్యా) రజత, కాంస్య పతకాలు సాధించారు. కార్ల్‌సన్‌కు ఇది మూడో ప్రపంచ ర్యాపిడ్ టైటిల్. ప్రపంచ బ్లిడ్జ్ ఛాంపియన్‌షిప్ ఆదివారం ఆరంభమవుతుంది.
ఇదీ చూడండి: -6 డిగ్రీల చలిలో నాలుగు ప్రపంచ పతకాలతో సత్తా