టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తాజాగా రెండో వన్డేలోనూ విఫలమవ్వడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అతడిని జట్టులో నుంచి తొలగించాలనే డిమాండ్లు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గతరాత్రి మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. కోహ్లీ ఫామ్‌పై ఎందుకింత చర్చ నడుస్తుందో తనకు అర్థంకావడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. విరాట్ చాలా ఏళ్ల నుంచి ఆడుతున్నాడని, అతడెన్నో మ్యాచ్‌లు ఒంటి చేత్తో గెలిపించాడని గుర్తుచేశాడు. అంత గొప్ప బ్యాట్స్‌మన్‌కు ఒకరు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. ఈ విషయం గురించి తాను గత ప్రెస్‌మీట్‌లోనూ చెప్పానని వెల్లడించాడు.
కోహ్లీకి ఒకరు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు: రోహిత్
విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. కోహ్లీ లాంటి ఆటగాడికి ఒకరు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు.
‘కోహ్లీ లాంటి ఆటగాడు తిరిగి గాడిలో పడాలంటే ఒకటి లేదా రెండు భారీ ఇన్నింగ్స్‌లు చాలు. అతడి గురించి నేను ఇదే అనుకుంటున్నా. క్రికెట్‌ని అనుసరించే వాళ్లు కూడా ఇలాగే భావిస్తారని ఆశిస్తున్నా. కోహ్లీ ఫామ్‌పై మేం కూడా మాట్లాడుకుంటాం. అయితే, పరిస్థితులను కూడా అర్థం చేసుకొని మేం మాట్లాడాలి. ప్రతి ఒక్కరి కెరీర్‌లో ఇలాంటి ఒడుదొడుకులు ఉంటాయి. అంతమాత్రాన ఆయా క్రికెటర్ల స్థాయి పడిపోదు. కోహ్లీ ఎన్నో పరుగులు చేసి అనేక సెంచరీలు చేశాడు. అతడి సగటు కూడా మెరుగ్గా ఉంది. మనమంతా ఆ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆటగాళ్ల కెరీర్‌లో ఇవన్నీ సహజమే. ఏ ఒక్కరూ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో రాణించలేరు. వ్యక్తిగత జీవితాల్లోనూ ఇలాంటి సమస్యలు ఉంటాయి’ అని హిట్‌మ్యాన్ మరోసారి కోహ్లీకి అండగా నిలిచాడు.
ఇదీ చదవండి:అదరగొట్టిన పీవీ సింధు.. సైనా, ప్రణయ్ టోర్నీ నుంచి ఔట్