తానేంటో మళ్లీ నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని మహిళా స్టార్ రెజ్లర్ గీతా ఫొగాట్ చెప్పింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఫొగాట్ గురువారం వెల్లడించింది. వయసు తనకు అడ్డంకిగా మారదని అంటోంది ఈ 32 ఏళ్ల రెజ్లర్. ఫిట్నెస్, ఏకాగ్రత ఉంటే విజయం సాధించొచ్చు అని ధీమా వ్యక్తం చేసిన గీత.. అజర్ బైజాన్‌కు చెందిన మారియా స్టాడ్నిక్ అనే రెజ్లర్‌ను అందుకు ఉదాహరణగా పేర్కొంది.
'33 ఏళ్లు పైన వయసు ఉన్న మారియా స్టాడ్నిక్.. ఇద్దరు పిల్లలకు తల్లి. అయినా ఆమె నాలుగు ఒలింపిక్ పతకాలు గెలుచుకోవడం సహా ఎన్నో అంతర్జాతీయ టోర్నీలలో విజయాలు సాధించింది' అని గీతా చెప్పింది.
ఆ ఆలోచన వస్తేనే..
రెజ్లింగ్‌కు వీడ్కోలు పలకడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదని.. అది తలచుకుంటేనే భయం వేస్తోందని చెప్పుకొచ్చింది గీతా ఫొగాట్. రెజ్లింగ్ తన రక్తంలోనే ఉందని.. పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది.
ప్రపంచస్థాయి రెజ్లింగ్‌లో సత్తాచాటిన గీత.. 2010, 2017 కామన్వెల్త్ పోటీల్లో గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది. 2017 అక్టోబరులో ఆల్ ఇండియా పోలీస్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గి.. నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 59 కిలోల విభాగంలోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 2016లో పవన్ కుమార్ అనే రెజ్లర్‌తో గీత వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.
ఈమె తండ్రి, ప్రముఖ మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫొగాట్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో 'దంగల్' అనే సినిమా తీశారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్.. మహావీర్ సింగ్ ఫొగాట్ పాత్ర చేశారు.
ఇదీ చూడండి :ఆటగాళ్ల విశ్రాంతి.. ఇక బీసీసీఐ చేతుల్లో!