Sakshi Malik Protest : భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్ల ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్లు సాక్షిమాలిక్, బజ్రంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. రెజ్లర్ల ఉద్యమం నుంచి వారిద్దరు తప్పుకుని.. తిరిగి తమ రైల్వే ఉద్యోగాల్లో చేరినట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ విషయంపై సాక్షిమాలిక్, భజరంగ్ పునియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. అవన్నీ నిజాలు కావంటూ కొట్టిపేరేశారు. న్యాయం జరిగేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అయితే రైల్వే ఉద్యోగాలకు హాజరవుతూనే.. ఆందోళనను చేస్తామని అన్నారు. ఈ క్రమంలో సోమవారం వీరిద్దరు విధులకు హాజరయ్యారు.
"ఉద్యమాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలే. హాని చేసేందుకే ఈ వార్తలను ప్రచారం చేస్తున్నారు. మేము వెనక్కి తగ్గలేదు, ఉద్యమాన్ని కూడా ఉపసంహరించుకోలేదు. మహిళా రెజ్లర్లు ఎఫ్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకున్నారన్న వార్తలు కూడా అవాస్తవమే. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం"
- రెజ్లర్ బజరంగ్ పునియా
"న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో మేమెవరూ వెనక్కి తగ్గలేదు. పోరాటంతో పాటు రైల్వేలో నా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. దయచేసి ఎలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు".
- రెజ్లర్ సాక్షి మాలిక్
'ఆయన్ను అరెస్ట్ చేయాలన్నదే మా ఏకైక డిమాండ్'
"మేము కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశాము. ఆయనతో సాధారణంగానే మాట్లాడాం. ఆయన్ను (బ్రిజ్ భూషణ్ సింగ్) అరెస్ట్ చేయాలన్నదే మా ఏకైక డిమాండ్. నిరసన విషయంలో వెనక్కి తగ్గలేదు. రైల్వేలో OSDగా విధుల్లోకి మళ్లీ చేరాను. న్యాయం జరిగే వరకు నిరసనలు కొనసాగిస్తాం" అని సాక్షి మాలిక్ తెలిపింది.
'ఐక్యంగా ఉంటూ న్యాయం కోసం పోరాడుతాం'
Satyawart Kadian Wrestler : "సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ ఫేక్ న్యూస్. మేము నిరసన నుంచి వెనక్కి తగ్గలేదు. మా నిరసన కొనసాగుతుంది. మేము ఐక్యంగా ఉంటూ న్యాయం కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మమ్మల్ని నిర్వీర్యం చేసేందుకు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. దేశం మొత్తం దిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా ఉంది" అని సాక్షి మాలిక్ భర్త, రెజ్లర్ సత్యవర్త్ కడియన్ అన్నారు.
ఏప్రిల్ 23 నుంచి దేశంలోని టాప్ రెజ్లర్లైన బజరంగ్ పునియా, సాక్షిమాలిక్, వినేష్ ఫొగాట్ నేతృత్వంలో రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ప్రారంభమైన ఆందోళన ఇంకా కొనసాగుతోంది. తమతో ఆయన దారుణంగా ప్రవర్తించేవారని, శరీరాన్ని తాకడం, అనుమతి లేకుండా దుస్తుల్లో చేతులు పెట్టడం.. కౌగిలించుకోవడం.. తదితర అసభ్య కార్యకలాపాలకు పాల్పడేవారని మహిళా రెజ్లర్లు ఇప్పటికే ఆయనపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే ఆరుగురు మహిళా రెజ్లర్లతో మొదటి ఎఫ్‌ఐఆర్, మరో మైనర్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదుతో రెండో ఎఫ్‌ఐఆర్ ఏప్రిల్ 28న దాఖలైంది. ఇందులో పోక్సో చట్టం సెక్షన్ కూడా ఉంది.