Nikhat Zareen: 'నాన్నా.. బాక్సింగ్ రింగ్‌లో అబ్బాయిల మాత్రమే ఎందుకున్నారు?' తెలంగాణ నిజామాబాద్ జిల్లాలోని కలెక్టర్ స్టోర్ట్స్ గ్రౌండ్లో ఒకప్పుడు నిఖత్ జరీన్ తన తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్‌ను అడిగిన ప్రశ్న ఇది. అందుకు ఆయన బదులిస్తూ.. ఈ ఆటకు చాలా కఠినంగా శ్రమించాలి. శక్తి కావాలి అని చెప్పారు. అమ్మాయిలు బాక్సింగ్ చేయలేరా? అని నిఖత్ మరో ప్రశ్న అడిగింది. అందుకు తండ్రి మరోసారి సమాధానం చెబుతూ.. మహిళలు పురుషులకు విధేయులని అందరూ భావిస్తుంటారు, ఇలాంటి ఆటలో రాణించలేరు అని అనుకుంటారని చెప్పారు. దీన్ని ఓ సవాల్‌గా తీసుకుంది నిఖత్. సరదాగా గడిపేందుకు గ్రౌండ్‌కు వెళ్లిన ఆమె.. ఎలాగైనా బాక్సర్ కావాలని దృఢంగా నిశ్చయించుకుంది. చివరకు కలను సాకారం చేసుకుని ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి కైవసం చేసుకుంది. మహిళలు శక్తిమంతులు కారని భావించే ప్రపంచంలో, అమ్మాయిలు నిక్కర్లు, టీషర్టులు వేసుకోవడం ఏంటని ప్రశ్నించే సమాజంలో నిఖత్ ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొని దేశం గర్వించే స్థాయికి చేరుకుంది. నిఖత్ ప్రయాణం ఎలా సాగిందో ఆమె తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ మాటల్లో..
నిఖత్‌కు బాక్సింగ్ పట్ల ఆసక్తి ఉందని మీకు ఎప్పుడు తెలిసింది?
వేసవి సెలవుల్లో ఓసారి నిఖత్‌ను కలెక్టర్ స్పోర్ట్స్ గ్రౌండ్‌కు తీసుకెళ్లా. అక్కడకు వచ్చే పిల్లలతో సరదాగా కాలక్షేపం చేస్తుందని అనుకున్నా. అక్కడికి వెళ్లాక ఏదైనా క్రీడ పట్ల ఆసక్తి ఉన్నట్లు చెప్తే అందులోనే శిక్షణ ఇప్పించాలకున్నా. ఆ తర్వాత రోజూ గ్రౌండ్‌కు తీసుకెళ్లా. ఆమెకు క్రీడల్లో రాణించే సత్తా ఉందని అర్థమైంది. మొదట్లో అథ్లెటిక్స్‌లో 100మీటర్లు, 200 మీటర్లలో శిక్షణ తీసుకుంది. 4-5 నెలల పాటు సాధన చేసింది. ఆ తర్వాత గ్రౌండ్లో కొంతమంది బాక్సర్లను చూసింది. నాన్నా.. బాక్సింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గేమ్.. కానీ అబ్బాయిలు మాత్రమే ఆడుతున్నారు, అమ్మాయిలు ఎందుకు ఆడటం లేదని ప్రశ్నించింది. అందుకు కఠోర శ్రమ, శక్తి కావాలని నేను చెప్పా. అప్పటి నుంచి ఆమె బాక్సర్ కావాలనుకుంది. అప్పుడే తన ప్రయాణం మొదలైంది.
కుమార్తెలను క్రీడల్లోకి తీసుకురావడం తల్లిదండ్రలకు కష్టతరమైన సమాజంలో మనం జీవిస్తున్నాం. బయటి నుంచి కూడా ఎన్నో ప్రతికూలతలు ఉంటాయి. వీటన్నింటినీ ఎలా అధిగమించారు?
నేను కూడా ఓ క్రీడాకారుడ్ని. నిఖత్‌కు బాక్సింగ్ పట్ల ఆసక్తి ఉందని నాకు అర్థమయ్యాక తనకు శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టా. తను కూడా బాగా ఉత్సాహంగా ఉంది. కానీ కొంత మంది తనకు బాక్సింగ్ ఎందుకు? వేరే ఆట ఏదైనా నేర్పించవచ్చు కదా అని చెప్పారు. నా వెనకాల విమర్శలు గుప్పించారు. నా స్నేహితులను కూడా నిఖత్‌కు బాక్సింగ్ ఎందుకు నేర్పిస్తున్నారు అని అడిగేవారు. బాక్సింగ్ నిఖత్ ఇష్ట ప్రకారం ఎంచుకున్న క్రీడ అని చెప్పా. మిగతాది ఆ దేవుడే చూసుకుంటాడన్నా. వాళ్ల మాటల్ని నేను అసలు పట్టించుకోలేదు. విశాఖపట్నంలో ఇండియన్ బాక్సింగ్ శిక్షణ క్యాంప్‌కు నిఖత్ ఎంపికయ్యింది. జాతీయ స్థాయికి చేరేవరకు నిఖత్ నిక్కర్లు, టీషర్టులు వేసుకోవడమేంటని మాట్లాడేవారు. కానీ నేను వాటిని వినిపించుకోలేదు. కొన్నిసార్లు మనం ఓపికగా ఉండాలి. ఇప్పుడు నిఖత్ ప్రపంచ ఛాంపియన్. అప్పుడు నిఖత్ గురించి రకరకాలు మాట్లాడిన వాళ్లే ఇప్పుడు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. మొత్తం మారిపోయింది. నిఖత్‌ను చూడాలని ఉందని, ఓసారి కలుస్తామని అడుగుతున్నారు.
ఇటీవల కాలంలో కుమార్తెల కెరీర్‌ను తండ్రులు తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేకించి క్రీడారంగంలో. పీవీ సింధు, సైనా నెహ్వాల్, ఇప్పుడు నిఖత్. మన దేశంలో కూతుర్లు, తండ్రులకు మీరిచ్చే సందేశం ఏంటి?
దేశంలో ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్లు వెలుగులోకి వస్తున్నారు. ఓ స్టోర్ట్స్ పర్సన్‌కు తండ్రిగా ఉండటం భారత్‌లో సులభం కాదు. ఇతరుల మాటలు పట్టించుకోకుండా మీ కుమార్తెలు ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వండి. వారికి మద్దతుగా నిలవండి. క్రీడలు వారిని శక్తిమంతం చేయడమే గాక, జీవితంలో ముందుకు తీసుకెళ్తాయి.
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తన భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించారు.