ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో బరిలో దిగిన తొలిసారే సవితశ్రీ అద్భుతం చేసింది. టోర్నీలో పోటీపడ్డ 98 మంది క్రీడాకారిణుల్లో ఆమె ర్యాంకు 36. ఆమె పతకం గెలుస్తుందన్న అంచనాలూ పెద్దగా లేవు. కానీ అసాధారణ ఆటతీరుతో కాంస్యం సాధించింది. గతేడాది మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ (డబ్ల్యూఐఎమ్) హోదా దక్కించుకున్న ఆమెకు ఇలా అంతర్జాతీయ వేదికలపై సంచలనాలు సృష్టించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్‌షిప్, ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్‌షిప్ బాలికల అండర్-12 విభాగంలో స్వర్ణాలు ముద్దాడింది.
ఆటపై ప్రేమతో..
సోదరుడు సరదాగా ఆడుతుంటే సవితకు చెస్‌పై ఆసక్తి కలిగింది. ఇంట్లోనే ఓనమాలు నేర్చుకుంది. ఓ టోర్నీలో ఆడి మంచి ప్రదర్శన చేయడంతో తండ్రి భాస్కర్ ప్రోత్సహించాడు. సింగపూర్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే అతను.. సవిత కెరీర్ కోసం ఉద్యోగాన్ని వదిలి స్వదేశం వచ్చాడు. ఆమెను వివిధ దేశాల్లో టోర్నీలకు తీసుకెళ్తున్నాడు. తనయను ప్రపంచ ఛాంపియన్‌గా చూడాలనే లక్ష్యంతో సాగుతున్నాడు. మరోవైపు సవిత కూడా తండ్రి ఆశలకు తగ్గట్లుగా ఆటలో రాటుదేలుతోంది. 2017లో బాలికల అండర్-9, 11 విభాగాల్లో జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పటివరకూ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో వివిధ వయసు విభాగాల్లో నాలుగేసి స్వర్ణాలు, రజతాలు దక్కించుకుంది. బాలికల అండర్-12 విభాగంలో 2018లో కామన్వెల్త్, ప్రపంచ క్యాడెట్ చెస్‌లో విజేతగా నిలిచింది. 2019లో బాలికల అండర్-12 ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.