భారత పారాలింపియన్ దేవేంద్ర జజారియా సత్తా చాటాడు. 40 ఏళ్ల ఈ రాజస్థాన్ ఆటగాడు జావెలిన్ త్రో (ఎఫ్-46)లో ప్రపంచ రికార్డు ప్రదర్శనతో టోక్యో పారాలింపిక్స్ బెర్తు సొంతం చేసుకున్నాడు. జాతీయ ట్రయల్స్‌లో జావెలిన్‌ను 65.71 మీటర్ల దూరం విసిరిన దేవేంద్ర.. తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డు (63.97 మీటర్లు)ను తిరగరాశాడు. ఆగస్టు 24న టోక్యో పారాలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రీడల్లో పాల్గొనడం దేవేంద్రకు ఇది మూడోసారి. 2004 ఏథెన్స్లో స్వర్ణం గెలిచిన అతడు.. 12 ఏళ్ల తర్వాత రియో క్రీడల్లో ప్రపంచ రికార్డు సృష్టిస్తూ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు.
మరోవైపు ఆసియా పారా క్రీడల పసిడి పతక విజేతలు అమిత్‌కుమార్ సరోహా (డిస్కస్ త్రో, ఎఫ్-51), సందీప్ చౌదరి (జావెలిన్ త్రో, ఎఫ్-44) టోక్యో పారాలింపిక్స్ బెర్తు సాధించారు. రెండుసార్లు పారాలింపిక్స్ ఆడిన అమిత్ ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్నాడు. మొదట హాకీ ఆటగాడైన అమిత్ 22 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురై వెన్నెముక గాయంతో వికలాంగుడిగా మారాడు. ఆ తర్వాత పారా క్రీడల్లోకి వచ్చి డిస్కస్ త్రోను ఎంచుకున్నాడు. మరోవైపు సందీప్ చౌదరి (జావెలిన్ త్రో) కూడా టోక్యో పారాలింపిక్స్‌లో పోటీపడనున్నాడు. ట్రయల్స్‌లో అతడు జావెలిన్‌ను 66.44 మీటర్ల దూరం విసిరి టోక్యో బెర్తు సొంతం చేసుకున్నాడు.