తెలంగాణ

telangana

ETV Bharat / sports

సిక్కోలు టూ సిడ్నీ ఒలింపిక్స్​​: మల్లీశ్వరి మళ్లీ వస్తోంది..!

బాక్సింగ్‌ క్వీన్‌ మేరికోమ్‌ బయోపిక్‌ హిట్‌. కుస్తీరాణి గీతా ఫోగట్‌ ఫ్యామిలీ బయోపిక్‌ సూపర్‌ హిట్‌. ఇప్పుడొస్తోంది.. తెలుగమ్మాయి బయోపిక్‌! అలవికాని బరువులను అవలీలగా ఎత్తిన అతివ కథ. ఒలింపిక్స్‌ పతక విజేత, పద్మశ్రీ పురస్కార గ్రహీత, రాజీవ్‌ ఖేల్‌రత్న మన కరణం మల్లీశ్వరి కథ.. వెండితెరకెక్కుతోంది. ఈ సందర్భంగా మల్లీశ్వరిని పలకరించగా.. ఆమె బోలుడన్ని విశేషాలు పంచుకున్నారు. ఆమె మాటల్లోనే వినండి.

By

Published : Jun 3, 2020, 7:45 AM IST

karnam malleswari
మల్లీశ్వరి అంటే పతకాలే కాదు..

బయోపిక్‌ వార్త అధికారికంగా బయటకు వచ్చాక.. నేను 33 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాను. ఎక్కడ సిక్కోలు.. ఎక్కడ సిడ్నీ! ఎన్నో సంవత్సరాల కఠిన శ్రమ. సడలని పట్టుదల.. అవన్నీ కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఉత్సాహంగా నేను బరువులు ఎత్తినప్పుడు 'ఆడపిల్లకు ఇవేం పాడు పనులు' అన్నవాళ్లున్నారు. 'మగరాయుడిలా ఈ వేషాలేంటే!' అని దెప్పిపొడిచారు. అప్పుడు నాకు 12 ఏళ్లు ఉంటాయంతే! ఏదో సాధించాలనే తపనే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది.

కరణం మల్లీశ్వరి

దారిలో ముళ్లపొదలెన్నో..

ఆడపిల్లనైతే మాత్రం కొన్నిటికే పరిమితం అని అనుకోవడం ఎందుకు? ఎవరేమన్నా లక్ష్యపెట్టకుండా కష్టపడ్డాను. కండలు తిరిగిన దేహం కోసం.. కొండంత బరువులు ఎత్తేదాన్ని. శారీరక సామర్థ్యం కోసం వ్యాయామాలు చేసేదాన్ని. సరైన సౌకర్యాలు లేకున్నా.. ఉన్నవాటితో నిరంతరం శ్రమించేదాన్ని. తిండి కలిగితేనే కండ! కానీ, అంతటి పౌష్టిక ఆహారం ఎక్కడిది. అంబలి తాగి కసరత్తులు చేసేదాన్ని. బచ్చలికూర, మునగాకు ఇవే ప్రొటిన్‌ ఫుడ్‌. మనోబలమే ముందుకు నడిపింది నన్ను. దారిలో ముళ్లపొదలు అడ్డొచ్చాయి. రాళ్లు గుచ్చుకున్నాయి. అన్నీ ఓర్చుకున్నా. నా ప్రయాణంలో కావాల్సినంత కథ ఉంది. ఆ విశేషాలన్నీ ఇప్పుడు చెప్పలేను. సినిమాలో చూస్తేనే బాగుంటుంది.

మన కరణం మల్లీశ్వరి

నా బయోపిక్‌ మాట ఇప్పటిది కాదు. ఐదేళ్లుగా చిత్రబృందం నన్ను సంప్రదిస్తూనే ఉంది. రచయిత, నిర్మాత కోన వెంకట్‌, దర్శకురాలు సంజనారెడ్ఢి. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఏదో రెగ్యులర్‌ ఫార్ములాతో తీస్తానంటే అస్సలు ఒప్పుకొనేదాన్ని కాదు. ఇతరులకు స్ఫూర్తి కలిగించేలా నా కథను కోన వెంకట్‌ సిద్ధం చేస్తున్నారు. చిత్రం కూడా అలాగే తీస్తారనే నమ్మకంతో చివరికి సరేనన్నా. అలా ఇన్నాళ్లకు ముహూర్తం కుదిరింది. ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్ల ఒలింపిక్స్‌ పతకం సాధించడం వెనుకున్న కష్టాన్ని ఈ చిత్రంలో చూపనున్నారు. మల్లీశ్వరి అంటే అవార్డులే కాదు.. వాటి వెనుక కంటతడి పెట్టించే ఎన్నో అంశాలు ఉన్నాయని అందరికీ అర్థమవ్వాలి. అవి చూసి మారుమూల గ్రామాల్లోని నిరుపేద ఆడపిల్లలు వారనుకున్న లక్ష్యాన్ని చేరడానికి స్ఫూర్తి పొందాలి.

అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నేటి యువతకు చాలా వేదికలున్నాయి. అధునాతన సౌకర్యాలు, సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. వీటిని సరైన రీతిలో వినియోగించుకోవాలి. దానికి స్వయంకృషి తోడైతే ఏదీ అసాధ్యం కాదు. పట్టుదలతో ముందుకుసాగాలి. శారీరకంగా, మానసికంగా సామర్థ్యాలను పెంచుకొని పోరాడాలి. అప్పుడు విజయం మనదే అవుతుంది.

నా కల కోసం...

దిల్లీలో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నా. హరియాణాలో నాపేరుతోనే అకాడమీ నిర్వహిస్తున్నా. అక్కడ 54 మంది నిరుపేద చిన్నారులకు ఉచితంగా వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణనిస్తున్నా. వీరందరికీ విద్యను కూడా అందిస్తున్నాం. నా భర్త రాజేష్‌త్యాగి, పిల్లలు శరత్‌చంద్ర, అంగద్‌ హరియాణాలోనే ఉంటున్నారు. చేయూతనందిస్తున్నారు. 2028 ఒలింపిక్స్‌ లక్ష్యంగా పిల్లలను తీర్చిదిద్దుతున్నాం.

ఇదీ చదవండి:104 ఏళ్ల బామ్మకు నారీశక్తి పురస్కారం

ABOUT THE AUTHOR

...view details