ప్రపంచ మానసిక దినోత్సవాన్ని (అక్టోబర్ 10న) పురస్కరించుకొని బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణె(deepika padukone new update) ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో డిప్రెషన్‌ను జయించినామె.. 'లివ్ లవ్ లాఫ్' అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి మానసిక సమస్యలతో బాధపడేవారికి ఆసరాగా నిలుస్తున్నారు. తాజాగా బీజింగ్ ఒలింపిక్స్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రాతో(abhinav bindra beijing) 'లెక్చర్ సిరీస్ 2021'తో ఓ ప్రొగ్రామ్‌ని ఏర్పాటు చేశారు. ఈ షోలో అభినవ్ బింద్రా తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అప్పుడు ఆటలంటే ఇష్టం ఉండేది కాదు
"చిన్నప్పుడు నేను క్రీడలను అస్సలు ఇష్టపడేవాడిని కాదు. చాలా లావుగా ఉండేవాడిని. పాఠశాలలో చదువుకునేటప్పుడు ఆటలను మిస్ అయ్యేవాడిని. కష్టపడే మనస్తతత్వం నాలో ఉండేది. ఇదే నా టాలెంట్‌గా భావించేవాడిని. ఇక విజయానికి నిర్వచనం ఇవ్వమంటే ఒకటే చెబుతా.. విజయం అంటే పూర్తిగా వైఫల్యాల నుంచి నేర్చుకోవడమే" అని అభినవ్ చెప్పగానే వెంటనే దీపిక.."మీరు నా మాటల్నే చెబుతున్నట్టు అనిపిస్తోంది. నేను కూడా సక్సెస్ కన్నా ఫెల్యూర్ నుంచే నేర్చుకున్నా" అని చెప్పారు.