గిన్నిస్ రికార్డు ఒక్కసారి సాధిస్తేనే అద్భుతమని అంటారు. అలాంటిది ఏకంగా నాలుగుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు హైదరాబాద్ తైక్వాండ్ ప్లేయర్ సాయి దీపక్. 60 సెకండ్లలో 59 సైడ్లాంజ్లు తీసి నాలుగోసారి ఈ ఘనత సాధించాడు.
ఒక్క నిమిషంలో అత్యధిక సైడ్లాంజ్లు తీసిన ఘనత అంతకుముందు పాకిస్థాన్‌కు చెందిన ఇర్ఫాన్ మెహసూద్ పేరిట ఉండేది. తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టాడు 23 ఏళ్ల దీపక్. మహిళల భద్రత, ఆర్మీలో ప్రాణత్యాగం చేసిన సైనికులకు, ఫిట్ ఇండియా కార్యక్రమం అభివృద్ధి కోసం ఈ రికార్డును అంకితమిస్తున్నాని దీపక్ చెప్పాడు.
"ఒక్క నిమిషంలో అత్యధిక సైడ్లాంజ్లు తీసి ఈ రికార్డు సాధించా. 59 సైడ్లాంజ్లతో నాలుగోసారి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించా. గతంలో పాకిస్థాన్‌కు చెందిన ఇర్ఫాన్ మెహసూద్ 54 సైడ్లాంజ్లు తీశాడు. నేను ఈ రికార్డు బ్రేక్ చేయడానికి మూడు నుంచి నాలుగు నెలలు పాటు ఎంతో కష్టపడ్డా. ఒక్క నిమిషంలో ఈ ఘనత సాధించడం చాలా కష్టం. ఈ ఏడాది మరో 2, 3 గిన్నిస్ రికార్డులు సాధిస్తానని అనుకుంటున్నా" -సాయి దీపక్, తైక్వాండో ప్లేయర్