దాదాపు మూడేళ్ల క్రితం నీతి ఆయోగ్- క్రీడలపై మనదైన ముద్ర వేసేందుకంటూ స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలను ప్రస్తావిస్తూ 2024నాటి ఒలింపిక్స్‌లో భారత్ ఎకాయెకి యాభై పతకాలు కొల్లగొట్టగలదనడం ఎందరినో విస్మయపరచింది. వాస్తవిక స్థితిగతుల్ని గాలికొదిలేసి నేలవిడిచి సాము చేసే బాధ్యతను తలకెత్తుకున్న రీతిగా, నూతన దశాబ్దిలో దేశ క్రీడా యవనిక కొత్త కాంతులీనగలదనేలా ఐఓఏ (భారత ఒలింపిక్ సంఘం) ఇప్పుడు భారీ లక్ష్యాలు వల్లెవేస్తోంది. 2021 ఐఓసీ (అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) కాంగ్రెసుకు ఆతిథ్యమివ్వడంతోపాటు- 2026 యువజన ఒలింపిక్ క్రీడల్ని, 2030 ఆసియా క్రీడల్ని ఇక్కడే నిర్వహించే అవకాశాల కోసం యత్నిస్తున్నట్లు ఐఓఏ సారథి నరీందర్ బాత్రా ఆరు నెలల క్రితం వెల్లడించారు. తాజాగా ఆ జాబితా ఇంకా విస్తరించింది. 2026 లేదా 2030 సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడలను, 2032లో ఒలింపిక్స్‌ను సైతం దేశీయంగా నిర్వహించేందుకు ఐఓఏ ప్రణాళికలు అల్లుతోంది. కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు అవకాశం దఖలుపడితే ఒలింపిక్స్ నిర్వహణ సునాయాసంగా సానుకూలపడుతుందని చిటికెల పందిళ్లు వేస్తోంది. ఈ ఏడాది ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహణకు జపాన్ తొలుత వేసిన అంచనా వ్యయం మూడింతలకుపైగా విస్తరించి సుమారు లక్షా 85వేల కోట్ల రూపాయలకు చేరనుందంటున్నారు. 2032నాటికి నిర్వహణ పద్దు ఏ తాళ ప్రమాణాలకు చేరుతుందో ప్రస్తుతానికి ఊహకందని అంశం. 2032 ఒలింపిక్స్ నిర్వహణ అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు ఆస్ట్రేలియా, ఇండొనేసియా, ఉభయ కొరియాలు, జర్మనీ వంటివి గట్టిగా పోటీపడుతున్నాయన్న కథనాల నేపథ్యంలో- ఖరారైనవి, కానివి కలిపి పదహారువరకు క్రీడోత్సవాల నిర్వహణకు భారత్ తరఫున సై అంటున్న స్వరాల శ్రుతి జోరెత్తుతోంది. ముఖ్యంగా, పర్యవసానాలు కానని భారత ఒలింపిక్ సంఘం ధోరణి విస్తుగొలుపుతోంది.
భారత్‌ను గెలిపించే వ్యూహం - undefined
ఐఓఏ (భారత ఒలింపిక్ సంఘం) భారీ లక్ష్యాలు వల్లెవేస్తోంది. 2021 ఐఓసీ (అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) కాంగ్రెసుకు ఆతిథ్యమివ్వడంతోపాటు- 2026 యువజన ఒలింపిక్ క్రీడల్ని, 2030 ఆసియా క్రీడల్ని ఇక్కడే నిర్వహించే అవకాశాల కోసం యత్నిస్తున్నట్లు ఐఓఏ సారథి నరీందర్ బాత్రా ఆరు నెలల క్రితం వెల్లడించారు. కానీ పర్యవసానాలు కానని భారత ఒలింపిక్ సంఘం ధోరణి విస్తుగొలుపుతోంది. అయితే ప్రతిభకు కొదవలేని దేశమిది. పుష్కల వనరుల్ని సద్వినియోగపరచుకొనే విధాన రచన, కేటాయింపులు, సదుపాయాలు, సమర్థ శిక్షకులు... సాకారమైనప్పుడే ఇక్కడా క్రీడోత్సాహం వెల్లివిరిసేది!
సియోల్, బార్సిలోనా, లండన్ వంటి చోట్ల ప్రతిష్ఠాత్మక క్రీడా సంరంభాల నిర్వహణ ఆయా దేశాలకు మౌలిక వసతులు, పర్యాటకం, అంతర్జాతీయ ప్రతిష్ఠ రూపేణా ఎన్నో విధాల లబ్ధి చేకూర్చిన మాట యథార్థం. ఒలింపిక్స్ నిర్వహణకు మరో పార్శ్వమూ ఉందన్నది తోసిపుచ్చలేని చేదునిజం. 1976నాటి మాంట్రియల్ విశ్వ క్రీడోత్సవాన్ని ఘనంగా రక్తికట్టించిన దరిమిలా నాలుగు దశాబ్దాలపాటు కెనడాను లోటు బడ్జెట్ భీతిల్లజేసింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ తరవాత గ్రీస్ మాంద్యం పాలబడగా నాటి విస్తృత స్థాయి ఏర్పాట్లు, వసతుల తాలూకు వ్యయభార క్లేశాలు ఇప్పటికీ వెన్నాడుతున్నాయి. ‘ఫిఫా’ ప్రపంచకప్ పోటీల సందర్భంగా భూరి ఖర్చుకోర్చి దక్షిణాఫ్రికా, బ్రెజిల్ నిర్మించిన ప్రత్యేక క్రీడా మైదానాలెన్నో ఎందుకూ కొరగాకుండా పడి ఉన్నాయి. పదేళ్లక్రితం కామన్వెల్త్ క్రీడలకు ఇండియా ఆతిథ్యం ఇచ్చినప్పుడు దిల్లీలో వెలసిన నిర్మాణాలెన్నో కొన్నేళ్లుగా బోసిపోతున్నాయి. అప్పట్లో సుమారు రూ.960 కోట్ల ఖర్చుతో జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియానికి నూతన హంగులద్ది ప్రారంభ, ముగింపు ఉత్సవాలకు వేదికగా మలచి ఆపై దాని ఉనికినే విస్మరించారు. నాడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి రూపుదిద్దిన ఇతరత్రా మౌలిక వ్యవస్థలనేకం నిరాదరణకు గురై నిర్వహణ భారం తడిసిమోపెడై తెల్లఏనుగులుగా భ్రష్టుపడుతున్నాయి. అటువంటి అనుభవాలెన్నో ఇతర దేశాల్లోనూ పోగుపడి ఉన్నాయి. 2010 కామన్వెల్త్ క్రీడల సన్నాహకాల్లో అవినీతి గబ్బు ఆనాడు దిల్లీని దట్టమైన మంచుదుప్పటిలా కమ్మేయడం తెలిసిందే. ఆ దుర్భర గతం పునరావృతం కాకుండా భారత ఒలింపిక్ సంఘం, కేంద్ర ప్రభుత్వం ఏమేమి జాగ్రత్త చర్యలు చేపట్టదలచిందీ అగమ్యం. క్రీడల నిర్వహణపై పెరపెర మాత్రం పెచ్చరిల్లుతోంది!
నాలుగేళ్లక్రితం రియో ఒలింపిక్స్‌లో సువిశాల భారతావని ఖాతాలో జమపడిన పతకాలు కేవలం రెండు; అంటే 65 కోట్ల జనాభాకు ఒకటి! దక్షిణాసియా క్రీడల్లో షూటింగ్, బాక్సింగ్, జూడో, తైక్వాండోవంటి విభాగాల్లో దండిగా పతకాల పంట పండించే ఇండియా- ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్, ఒలింపిక్స్ హోరాహోరీలో ఆనవాయితీగా చతికిలపడుతోంది. విశ్వ క్రీడోత్సవాల్లో భారత్ గట్టి పోటీదారుగా నిలవగల అంశాల సంఖ్య నాలుగైదుకే పరిమితమవుతున్నప్పటికీ 2020 ఒలింపిక్స్‌లో 25 పతకాలు తథ్యమని 2012 ఆగస్టులో క్రీడా శాఖామాత్యులుగా అజయ్ మాకెన్ జోస్యం చెప్పారు. అదే ఒరవడి పుణికి పుచ్చుకొన్నట్లుగా ప్రస్తుత కేంద్ర క్రీడల మంత్రి కిరెన్ రిజిజు 2024 లేదా 2028 పతకాల పట్టికలో భారత్ తొలి పది స్థానాల్లో ఉండి తీరాలంటున్నారు. ఆ బంగారు కల నిజం కావాలంటే దృష్టిని కేంద్రీకరించాల్సింది- క్రీడల నిర్వహణపైన కాదు, ఔత్సాహిక క్రీడాకారుల్ని జగజ్జేతలుగా రాటుతేల్చడం మీద! సమధికంగా ఒలింపియన్ల సృజనలో ఇండియా వైఫల్యానికి మూలాలు పాఠశాల విద్యలోనే ఉన్నాయని నిపుణులు కొన్నేళ్లుగా మొత్తుకుంటున్నారు. ఎనిమిదిన్నర లక్షలకుపైగా వ్యాయామ కేంద్రాలు, సుమారు మూడువేల ప్రత్యేక క్రీడా వసతి వ్యవస్థల్ని నెలకొల్పిన చైనా- నాలుగైదేళ్ల వయసు పిల్లల్లోనే సహజ ప్రతిభను గుర్తించి నిరంతర శిక్షణతో సానపడుతోంది. అమెరికాలో ఎన్‌సీఏఏ (నేషనల్ కొలీజియెట్ అథ్లెటిక్స్ అసోసియేషన్) కళాశాల స్థాయి వరకు విద్యార్థుల్లో క్రీడాసక్తిని ప్రోత్సహిస్తూ పతక వీరుల ఉత్పత్తి కర్మాగారంగా వర్ధిల్లుతోంది. అదే ఇక్కడ- దేశం నలుమూలలా బడుల్లో వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలు పెద్దయెత్తున పేరుకుపోయాయి. ప్రతి పాఠశాలలో విధిగా ఆటస్థలం, క్రీడా సామగ్రి ఉండాలన్న విద్యాహక్కు చట్ట నిబంధనల స్ఫూర్తి నిలువునా నీరోడుతోంది. ప్రతిభకు కొదవలేని దేశమిది. పుష్కల వనరుల్ని సద్వినియోగపరచుకొనే విధాన రచన, కేటాయింపులు, సదుపాయాలు, సమర్థ శిక్షకులు... సాకారమైనప్పుడే ఇక్కడా క్రీడోత్సాహం వెల్లివిరిసేది!
TAGGED:
INDIAN OLYMPIC ASSOCIATION