Harshada Sharad biography: ఐడబ్ల్యూఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత వెయిట్ లిఫ్టర్ హర్షద స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సరికొత్త రికార్డు సృష్టించింది. గ్రీస్‌లో జరిగిన ఈ పోటీల్లో మహిళల 45 కేజీల విభాగంలో స్నాచ్‌లో 70 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 83 కేజీలతో మొత్తం 153 కిలోల బరువులెత్తి జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఈ ఘనత వెనుక తండ్రి కల, ఆమె కఠోర శ్రమ ఉన్నాయి.
హర్షద తండ్రి శరద్‌కు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఆసక్తి. వెయిట్‌లిఫ్టింగ్‌లో కోచింగ్ కూడా తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి పాఠశాల పోటీల్లో వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతపతకం గెలుచుకున్నారు. అయితే ఆ తర్వాత శరద్ తండ్రి మరణించడంతో కుటుంబపోషణ భారం తనపై పడింది. దీంతో తన కలను పక్కనబెట్టి ఉపాధిపై దృష్టిపెట్టారు. అయితే తన పిల్లలతోనైనా తన కలను నెరవేర్చుకోవాలనుకున్నారు. తొలి సంతానంగా హర్షద పుట్టగానే ఆమెను వెయిట్‌లిఫ్టర్‌ను చేయాలనుకున్నారు. హర్షద కూడా చిన్నతనం నుంచి చదువు కంటే ఆటలపైనే ఎక్కువగా ఆసక్తి పెట్టేది.
హర్షద ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఒక రోజు 50 కేజీల బియ్యం బస్తా ఎత్తేసింది. ఇది చూసి శరద్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన కుమార్తె కచ్చితంగా గొప్ప అథ్లెట్ అవుతుందని అప్పుడే డిసైడ్ అయిన శరద్.. హర్షదకు అప్పటి నుంచి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. దిగువ మధ్య తరగతి కుటుంబమే అయినప్పటికీ కుమార్తెకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఎంతో కష్టపడ్డారు.
టీచర్ మాటను సవాల్‌గా తీసుకుని..:హర్షదకు పట్టుదల చాలా ఎక్కువ. చిన్నప్పుడు సరిగా చదవడం లేదని ఓ ఉపాధ్యాయుడు ఆమెను మందలించారట. కనీసం పాస్ మార్క్‌లు కూడా రావని హేళనగా మాట్లాడారు. దీంతో సవాల్‌గా తీసుకున్న హర్షద పట్టుబట్టి చదవి పాసవడం గాక, ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది. వెంటనే ఆ ఉపాధ్యాయుడి దగ్గరకు వెళ్లి తాను సాధించానంటూ స్వీట్లు కూడా పంచిందని ఆమె తండ్రి గుర్తు చేసుకున్నారు. ఇదే పట్టుదల తన శిక్షణలోనూ కన్పించేదని శరద్ అన్నారు. ఎంతటి కఠినమైన సాధననైనా ఆనందంగా చేసేదని తెలిపారు.