FIFA World Cup Final :ఫిఫా ప్రపంచకప్ 2022 మెగా టోర్నీ చివరి దశకు వచ్చేసింది. ఆదివారం జరిగే సాకర్ ఫైనల్ సమరంలో విశ్వవిజేత ఎవరో తేలనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తో అర్జెంటీనా తలపడనుంది. అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ ఫైనల్ పోరులోనే 'బంగారు బూటు' దక్కించునే ఆటగాడు ఎవరో కూడా తేలిపోతుంది. ఈ అవార్డు కోసం ఫుట్‌బాల్ మాంత్రికుడు, అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ, ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపె ముందు వరుసలో ఉన్నారు. ఇంతకీ ఏంటీ 'గోల్డెన్ బూట్'..? ఈ అవార్డును ఎవరికిస్తారు..?
1982లో తొలిసారి..1930 నుంచి ఫిఫా ప్రపంచకప్ టోర్నీలు జరుగుతున్నాయి. అప్పటి నుంచే మెగా టోర్నీలో అత్యధిక గోల్స్ సాధించిన వారికి ప్రత్యేకంగా ట్రోఫీలు ఇస్తున్నారు. అయితే 1982 ప్రపంచకప్ నుంచి 'గోల్డెన్ షూ' పేరుతో ఈ అవార్డులను ఇస్తున్నారు. ఫుట్‌బాల్ ఆటగాడు ధరించే బూట్ ఆకారంతో ఉండే ఈ ట్రోఫీని ఇత్తడితో చేసి బంగారు పూత పూస్తారు. దీని బరువు దాదాపు కిలో వరకు ఉంటుంది. 2006 ప్రపంచ కప్ నుంచి దీని పేరును 'గోల్డెన్ బూట్'గా మార్చారు.
- మెస్సీ vs ఎంబాపె..
తాజా టోర్నీలో ఈ అవార్డు కోసం పోటీ పడుతున్న వారిలో మెస్సీ, ఎంబాపె ముందు వరుసలో ఉన్నారు. ఈ ఏడాది టోర్నీలో తమ జట్లు ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించిన ఈ అగ్రశ్రేణి ఆటగాళ్లు.. చెరో అయిదు గోల్స్‌తో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. - ఈ టోర్నీలో మెస్సీ ఐదు గోల్స్ చేయగా.. మరో మూడింటికి సహకరించాడు. సౌదీ అరేబియా, మెక్సికో, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, క్రొయేషియాపై ఒక్కో గోల్ సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ కళ్లు చెదిరే గోల్‌తో ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో మొత్తం 570 నిమిషాలు ఆడిన మెస్సీ.. మూడు పెనాల్టీ కిక్స్‌ను విజయవంతంగా ఉపయోగించుకున్నాడు.
- ఇక, గోల్డెన్ బూట్ కోసం పోటీ పడుతున్న ఎంబాపె కూడా ఐదు గోల్స్ చేసి.. మరో రెండింటికి సహకరించాడు. ఆస్ట్రేలియాపై 1, డెన్మార్క్‌పై 2, పోలాండ్‌పై 2 గోల్స్ చేశాడు. మొరాకోతో జరిగిన సెమీస్‌లో ఎంబాపెకు గోల్ దక్కలేదు.