జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అర్జున పురస్కారాల కోసం 29 మందిని సెలక్షన్ కమిటీ సిఫారసు చేసింది. ఆ జాబితా నుంచి సాక్షి మాలిక్, మీరాబాయ్‌లను తప్పించిన క్రీడా మంత్రిత్వ శాఖ.. మిగిలిన వారికి పచ్చజెండా ఊపింది. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షికి అదే ఏడాది ఖేల్‌రత్న లభించింది. అయితే అర్జున అవార్డు దక్కించుకోవడానికి కారణం తాను గతంలో ఖేల్‌రత్న గ్రహీతగా ఉండటమేనా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సాక్షి మాలిక్. అర్జున అవార్డు కోసం తాను ఇంకే పతకం సాధించాలని ఆవేదన వ్యక్తం చేసింది. అర్జున అవార్డు గ్రహీత సాక్షి మాలిక్ అని పిలవాలనేదే తన లక్ష్యమని 'ఈటీవీ భారత్' చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపింది.
"ప్రతి అథ్లెట్.. వారికి సంబంధించిన అన్ని పురస్కారాలను గెలుచుకోవాలనుకుంటారు. నేను ఖేల్రత్నను అందుకున్నట్లుగా అర్జున అవార్డును ఎందుకు గెలుచుకోలేను. మేము చేసే ప్రయత్నాలన్నిటికీ అర్థం ఏమిటి? అర్జున అవార్డూ ప్రతి క్రీడాకారుడు కలలు కనే ఓ ప్రధాన పురస్కారం. ఆ అవార్డు పొందడానికి నేను ఇంకా ఏమి చేయాలి? నేను గతంలో పెద్ద అవార్డు పొందినందున అర్జున అవార్డుకు అవసరం లేదని అనుకున్నారా? అలా అయితే రెండు అవార్డులను అందుకున్న అథ్లెట్లు ఒకదాన్ని తిరిగి ఇవ్వాలి."
- సాక్షి మాలిక్, భారత మహిళా రెజ్లర్