ఒడిశాలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన ద్యుతీ చంద్.. పీటీ ఉష తర్వాత ఒలింపిక్స్‌కు(2016 రియో) అర్హత సాధించిన తొలి స్ప్రింటర్‌గా ఘనత కెక్కింది. ఇటీవలే నేపిల్స్లో జరిగిన వరల్డ్ వర్సీటీ గేమ్స్‌లో సత్తాచాటింది 100 మీటర్ల పరుగులో స్వర్ణపతకాన్ని కైవసం చేసుకుని వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. ఈ విజయం అంత సులభంగా దక్కలేదని అంటోంది ద్యుతీ. దీని వెనుక ఉన్న కృషిని ఈటీవీ భారత్‌తో పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే....
భయం భయంగానే ఫైనల్లో..
ఈ విజయం అంత సులువుగా రాలేదు. వరల్డ్ వర్సిటీ గేమ్స్ ఫైనల్లో కొంచెం భయమేసింది. ఎందుకంటే 100 మీటర్ల విభాగంలో నాతో తలపడిన ఐరోపా క్రీడాకారులందరికీ నా కంటే మంచి రికార్డు ఉంది.
విజయం ఒడిశా ప్రభుత్వానికి అంకితం..
100 మీటర్ల పరుగులో నెగ్గిన ఈ స్వర్ణాన్ని ఒడిషా ప్రభుత్వానికి, నా స్పాన్సర్లకు, శ్రేయోభిలాషులకు అంకితమిస్తున్నా. ఎందుకంటే నేను కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు వారే నాకు అండగా నిలిచారు. వాళ్ల మద్దతు లేకుంటే నాకు ఈ విజయం దక్కేది కాదు.
టోక్యో ఒలింపిక్సే లక్ష్యం..
ప్రస్తుతం నా దృష్టి 2020 టోక్యో ఒలింపిక్స్‌పైనే ఉంది. విశ్వక్రీడల్లో దేశానికి స్వర్ణం నెగ్గాలనేది నా ఆశయం. ఇందుకు విదేశాల్లో సాధన చేయాలనుకుంటున్నా. అక్కడ పరిస్థితులకు అలవాటు పడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసం ప్రోత్సాహం అందించాలని కోరుతున్నా.