తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సుశీల్​.. ఎందుకిలా చేశావ్​?'

భారత రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్టుపై పలువురు క్రీడాకారులు స్పందించారు. ప్రస్తుతానికి ఇది ఆరోపణ మాత్రమేనని, నేరం రుజువైతే భారత క్రీడా వ్యవస్థలో ఇదొక చీకటి కోణంగా మిగిలిపోతుందని పలువురు క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు.

sushil kumar, indian wrestler
సుశీల్ కుమార్, భారత రెజ్లర్

By

Published : May 23, 2021, 5:42 PM IST

Updated : May 23, 2021, 6:40 PM IST

భారత స్టార్ రెజ్లర్​, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్​ కుమార్​ను హత్య కేసు ఆరోపణలతో దిల్లీ పోలీసులు అరెస్ట్​ చేశారు. తన విజయాలతో మువ్వెన్నల పతకాన్ని రెపరెపలాడేలా చేసిన సుశీల్​.. దిల్లీ పోలీసుల వద్ద ముఖానికి టవల్​తో కనిపించడంపై పలువురు క్రీడాకారులు స్పందించారు. సుశీల్​ అసలు ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదంటున్నారు. ఈ సమయంలో ఏం మాట్లాడాలో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ప్రపంచ రెజ్లింగ్ దినోత్సవం రోజునే జరగడం గమనార్హం.

2008 బీజింగ్​ ఒలింపిక్స్​లో సుశీల్​తో పాటు కాంస్య పతకం సాధించిన బాక్సర్​ విజేందర్ సింగ్.. అరెస్టుపై స్పందించాడు. "సుశీల్​.. భారతీయ క్రీడల కోసం చేసిన కృషి అతనితో పాటే ఉంటుంది. ప్రస్తుత సమయంలో ఇంతకంటే ఎక్కువ చెప్పలేను," అని​ పేర్కొన్నాడు.

"నిజంగా ఈ హత్య కేసులో సుశీల్ ప్రమేయముంటే అది దురదృష్టకరం. ఇది కేవలం రెజ్లింగ్​కు మాత్రమే కాక పూర్తి భారత క్రీడలపై చెడు ప్రభావం చూపిస్తుంది. మనకున్న అత్యుత్తమ అథ్లెట్లలో సుశీల్ ఒకడు. ఇప్పుడు ప్రజలు అతని వైపు చూస్తున్నారు," అని టేబుల్​ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ పేర్కొన్నాడు.

"సుశీల్​ ఒక మర్యాదపూర్వకమైన వ్యక్తి. అతనొక రోల్ మోడల్​. అతనికి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు లభించాయి. ఇలాంటి ఘటనల్లో పాల్గొనకుండా ఉండాల్సింది. ఇలా జరగడం సిగ్గుచేటు, దురదృష్టకరం," అని హాకీ మాజీ కెప్టెన్ అజిత్​పాల్ సింగ్ తెలిపాడు.

ఇదీ చదవండి:రెజ్లర్ సుశీల్ అరెస్టు: కెరీర్​ను నాశనం చేసిన అద్దె గొడవ

వీరితో పాటు చాలా మంది క్రీడాకారులు సుశీల్​ అరెస్ట్​పై స్పందించారు. "ప్రస్తుతానికి సుశీల్ నిందితుడే.. అతడిపై నేరం ఇంకా నిరూపణ కాలేదు. ఇందులో అతని పాత్ర ఏమీ లేకపోతే.. అతనికి కచ్చితంగా న్యాయం జరుగుతుంది," అని అతని సన్నిహిత క్రికెటర్​ ఒకరు తెలిపాడు.

"సుశీల్​పై వస్తున్న ఆరోపణలు నిజమైతే భారత క్రీడా చరిత్రలో ఇదొక చీకటి ఎపిసోడ్ అవుతుంది. చాలా మంది యువ రెజ్లర్లకు అతడొక రోల్​ మోడల్" అని మరో క్రీడాకారుడు అభిప్రాయపడ్డాడు.

"ప్రస్తుతానికైతే రెజ్లింగ్​పై ఇది ప్రభావం చూపిస్తుంది. క్రీడలు నేటితో ఆగిపోయేవి కావు. ఈ సంఘటన కాలగర్భంలో కలిసిపోతుంది. క్రికెట్​లో స్పాట్​ ఫిక్సింగ్​, మ్యాచ్​ ఫిక్సింగ్ జరుగుతున్న ఉదంతాలున్నాయి. ఇది కూడా అంతే.. అంతగా ప్రభావం చూపదు," అని ఓ ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు పేర్కొన్నాడు.

అసలేం జరిగింది?

ఛత్రసాల్​ స్టేడియంలో మే 4న రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఇందులో మల్లయోధులు సాగర్​, సోను, అమిత్​ల బృందంపై.. సుశీల్​ కుమార్, అతని అనుచరులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో సాగర్​ మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. సంఘటన స్థలంలో కొన్ని వాహనాలతో పాటు ఓ గన్ లభ్యమయ్యాయి. ఇందుకు సంబంధించి మోడల్​ టౌన్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న సుశీల్​ను.. తాజాగా దిల్లీ పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ చదవండి:సుశీల్​ బెయిల్​ పిటిషన్​ తిరస్కరణ

Last Updated : May 23, 2021, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details