మహిళల బాడీ బిల్డింగ్ పోటీలు గురించి వినే ఉంటాం. పురుషుల మాదిరిగానే బికినీలు ధరించి కండలు ప్రదర్శిస్తారు. ముస్లీం మెజార్టీ గల బంగ్లాదేశ్‌లో తొలిసారి ఈ పోటీలను ఆదివారం నిర్వహించారు. అయితే ఇక్కడ మాత్రం శరీరం కనిపించకుండా, బట్టలేసుకుని తమ శరీర సౌష్టవాన్ని ప్రదర్శించారు. ఈ పోటీల్లో 19ఏళ్ల అవోనా రెహమాన్ విజేతగా నిలిచింది.
బిగుతుగా ఉండే లెగ్గిన్స్, ఔట్ ఫిట్లు ధరించి దేహధారుడ్య పోటీల్లో పాల్గొన్నారు మహిళలు. మూడు రోజులపాటు ఢాకాలో ఈ పోటీలు జరిగాయి. రెహమాన్‌తో పాటు 29 మంది స్త్రీలు ఈ పోటీల్లో తమ దేహధారుడ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం విజేతగా నిలిచినందుకు రెహమాన్ ఆనందం వ్యక్తం చేసింది.
"నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇందుకోసం నేను ఎంతో కష్టపడ్డా. నా దేహాన్ని చూపిస్తే విమర్శిస్తారనే ఆలోచనే నా మనసులో కలగలేదు. నా సోదరుడు వ్యాయామశాల నడుపుతున్నాడు. అతడు నాకు మద్దతుగా నిలిచాడు. "
- అవోనా రెహమాన్, బాడీ బిల్డర్