భారత కాంపౌండ్ ఆర్చరీ జట్టు సభ్యులు రాత్రి నడిరోడ్డుపై కొన్ని గంటలపాటు గడపాల్సి వచ్చింది. ఓ తప్పుడు కరోనా పాజిటివ్ ఫలితం వల్ల ఆ జట్టు ఆర్చరీ ప్రపంచకప్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. వాళ్ల గురించి భారత ఆర్చరీ సమాఖ్య (ఏఏఐ) పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ కాంపౌండ్ జట్టులో తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ కూడా ఉంది.
తప్పుడు కొవిడ్ రిపోర్ట్.. ప్రపంచకప్‌కు దూరం - sports news
పొరపాటున జరిగిన తప్పిదం కారణంగా ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లలేకపోయింది భారత ఆర్చరీ జట్టు. అంతే కాకుండా నడిరోడ్డుపై అర్ధరాత్రి గంటల పాటు ఆర్చర్లు నిరీక్షించాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే?
సోమవారం మధ్య అమెరికాలోని గాటెమాలలో ఆరంభమయ్యే ప్రపంచకప్ తొలి దశ ఆర్చరీ పోటీల కోసం భారత కాంపౌండ్, రికర్వ్ జట్లు కలిసి శుక్రవారం రాత్రి 2.50 గంటలకు దిల్లీ నుంచి ఆమ్‌స్టర్‌డామ్ వెళ్లే విమానం ఎక్కాల్సింది. సోనెపట్ నుంచి బయల్దేరిన కాంపౌండ్ ఆర్చర్లు.. ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న రికర్వ్ ఆర్చర్లను విమానాశ్రయంలో కలవాల్సి ఉంది. కానీ దిల్లీ సరిహద్దుల్లోకి ప్రవేశించే సమయంలో కాంపౌండ్ ఆర్చర్ల బస్సును ఆపేయాలని ఏఏఐ నుంచి ఆదేశాలు వచ్చాయి. కాంపౌండ్ జట్టు కోచ్ గౌరవ్ శర్మకు సోనేపట్ సాయ్‌లో గురువారం నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలడమే అందుకు కారణం. దీంతో అతనితో సన్నిహితంగా మెలిగిన కాంపౌండ్ ఆర్చర్లు.. రికర్వ్ ఆర్చర్లను కలిస్తే ప్రమాదమని భావించిన ఏఏఐ వాళ్లను మధ్యలోనే ఆపేసింది. దీంతో కర్నల్ బైపాస్‌పైనే వాళ్లు గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ అర్ధరాత్రి పూట జట్టులోని ముగ్గురు మైనర్లు సహా ఎనిమిది మంది ఆర్చర్లు సొంతంగా ప్రయాణం చేసి ఇళ్లకు చేరుకున్నారు. సురేఖ అర్ధరాత్రి హైదరాబాద్ విమానంలో వచ్చేసింది. అయితే శనివారం పటియాలాలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో చేయించుకున్న పరీక్షలో గౌరవ్ శర్మకు నెగెటివ్ వచ్చింది. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. కాంపౌండ్ జట్టు అప్పటికే ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. . కాంపౌండ్ ఆర్చర్లంటే ఏఏఐకి పట్టింపు లేదని, ఒలింపిక్స్‌లో పోటీపడే రికర్వ్ ఆర్చర్లకే ప్రాధాన్యతనిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.