అనారోగ్యం బారిన పడితేనే జీవితంలో ఏదో కోల్పోయినట్లు బాధపడేవాళ్లు చాలమంది ఉన్నారు. కేన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధులైతే ఈ భయం ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ అమెరికా స్విమ్మర్ సారా థామస్ కేన్సర్‌ను జయించడమే కాదు.. ఇంగ్లీష్ ఛానల్‌ను ఏకంగా నాలుగు సార్లు ఈది రికార్డు సృష్టించింది. ఎక్కడా ఆగకుండా ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఆదివారం మొదలు పెట్టిన ఆమె నాలుగో ప్రయాణాన్ని ఆపకుండా మంగళవారానికి పూర్తి చేసింది. మొత్తం 84 మైళ్లను (135 కిలో మీటర్లు) 54 గంటల్లో ఈదింది సారా.
"నేను పూర్తి చేశానంటే నమ్మలేకపోతున్నా. జీవితాంతం నాకు ఓ మధుర జ్ఞాపకంగా ఇది మిగిలిపోతుంది. వేసే ప్రతి అడుగు ఎంతో కష్టంగా అనిపించింది" -సారా థామస్, స్విమ్మర్