Bejing Winter Olympics Arif Khan: వింటర్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించబోతున్నందుకు సంతోషంగా ఉందని స్కీయర్ ఆరిఫ్ ఖాన్ అన్నాడు. తానింకా మెరుగుపడాల్సివుందని చెప్పాడు. జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్‌కు చెందిన 31 ఏళ్ల అరిఫ్.. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో పోటీపడనున్న ఏకైక భారత అథ్లెట్. స్లాలోమ్, జెయింట్ స్లాలోమ్ ఈవెంట్లలో అతడు పాల్గొంటాడు.
"ఈ గేమ్‌ను భారతీయులకు పరిచయం చేయాలన్నది నా కల. వింటర్ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న ఏకైక భారతీయుణ్ని కావడం ద్వారా యువతకు ప్రేరణగా నిలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. మౌంటెయిన్ స్కీయింగ్‌లో అవకాశాలున్నాయని ఇప్పుడు చాలా మందికి తెలుసు" ఆరిఫ్ ఖాన్ అన్నాడు.
"మనకు పర్వతాలు ఉన్నాయి. మంచు ఉంది. గుల్మార్గ్‌లో అల్పైన్ స్కీయింగ్ ఉచిత రైడ్ కూడా ఉంది. ఇంకొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే వచ్చే 4-5 ఏళ్లలో శీతాకాల క్రీడలకు మనం పెద్ద గమ్యస్థానం అవుతాం. క్రీడలు, పర్యటకం కోసం హిమాలయాలను ఉపయోగించుకోవచ్చు. ఇది ఆరంభం మాత్రమే. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గొప్పగా అనిపిస్తోంది. యువతను, ముఖ్యంగా జమ్ముకశ్మీర్ యువతకు ప్రేరణనివ్వడం నా కల. ఇంకా మెరుగుపడడానికి ప్రయత్నిస్తా’’ అని ఆరిఫ్ చెప్పాడు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 4న ఆరంభం కానున్నాయి.