రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా దిల్లీ జంతర్ మంతర్ ముందు నిరసనకు బైఠాయించారు స్టార్ రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్. రెజ్లర్ జాతీయ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వైఖరికి వ్యతిరేకంగా ఈ నిరసనలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ నిరసనకు మద్దతిచ్చేందుకు బజరంగ్ పునియా కోచ్ సుజీత్ మాన్, ఫిజియో ఆనంద్ దూబే సహా బజరంగ్ సహాయక సిబ్బంది కూడా పాల్గొన్నారు. దాదాపు 30 మంది రెజ్లర్లు పాల్గొన్న ఈ నిరసనలో బజరంగ్, వినేష్తో పాటు సరితా మోర్, సంగీతా ఫోగట్, సత్యవర్త్ మాలిక్, జితేందర్ కిన్హా, సుమిత్ మాలిక్ హాజరయ్యారు. సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మరిన్ని వివరాలను బయటపెడుతామన్నారు.
"మా పోరాటం ప్రభుత్వం లేదా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా కాదు. ఇది డబ్ల్యుఎఫ్‌ఐకి వ్యతిరేకం. 'యే అబ్ ఆర్ పార్ కి లడై హై' (ఇది ముగింపు వరకు పోరాటం). రెజ్లర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా పనిచేస్తున్న విధానానికి వ్యతిరేకంగా మేము ఈ నిరసనను తెలియజేస్తున్నాం. దీనికి ఏ విధమైన రాజకీయాలతో సంబంధం లేదు. మేము ఇక్కడకు రాజకీయ నాయకులను ఆహ్వానించలేదు. ఇది పూర్తిగా మల్లయోధుల నిరసన."