Asian Games 2022: ఈ ఏడాది ఆసియా గేమ్స్ పోటీలు మరికొన్ని నెలల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్(ఏఐసీఎఫ్).. ఆటగాళ్లను పోటీకి సిద్ధం చేస్తోంది. భారత చెస్ టీమ్ ఎలాగైనా పతకాలు సాధించాలని ఆశిస్తున్న ఏఐసీఎఫ్.. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను మెంటార్‌గా నియమించింది.
"భారత ఆటగాళ్లు ఆసియా గేమ్స్‌లో నాలుగు స్వర్ణ పతకాలు సాధించాలని ఆశిస్తున్నాం. ఇందుకోసం విశ్వనాథన్ ఆనంద్‌కు మెంటార్ బాధ్యతలు అప్పగించాం. ఈ మేరకు పురుష, మహిళ ఆటగాళ్లతో ఆనంద్ తొలి సెషన్ వచ్చే గురువారం జరగనుంది." అని ఏఐసీఎఫ్ అధికారి తెలిపారు.
2010 గువాంగ్ఝౌ గేమ్స్‌లో భారత్ రెండు కాంస్య పతకాలు మాత్రమే సాధించింది. ఈ నేపథ్యంలో 2022 ఆసియా గేమ్స్ దృష్ట్యా ఏఐసీఎఫ్ అప్రమత్తమైంది. పురుషుల టీమ్ కోసం 10 మందిని, మహిళల టీమ్ కోసం 10 మందిని ఎంపిక చేస్తున్నట్లు పేర్కొంది. అయితే.. వీరిలో అంతిమంగా జట్టుకు ఐదుగురు మాత్రమే మిగులుతారు. ఈ జాబితాను సెలక్షన్ కమిటీ ఏప్రిల్‌లో ప్రకటిస్తుంది. అభిజిత్ కుంటే, దిబేయాందు బారువా, దినేష్ శర్మ సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు.
ఆసియా గేమ్స్‌లో భాగంగా.. సెప్టెంబర్ 11 నుంచి చెస్ ఈవెంట్స్ ప్రారంభంకానుండగా.. రెండు ఫార్మాట్లలో పోటీలు జరగనున్నాయి. పురుషుల, మహిళల సింగిల్స్ సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 16-24 మధ్య ఐదుగురు సభ్యులతో కూడిన పోటీలు జరగనున్నాయి.