బ్రిడ్జర్ వాకర్.. అమెరికాలోని వ్యోమింగ్‌కు చెందిన ఆరేళ్ల ఈ బుడతడు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్‌గా మారాడు. ఇతడు చేసిన ఓ సాహస పనిని నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
ఇంటి సమీపంలో తన చెల్లితో కలిసి వాకర్ ఆడుకుంటుండగా.. ఓ కుక్క వాళ్ల మీదకు దూకింది. అసలే చిన్నదైన తన చెల్లిని ఏమి చేయకుండా ఓ యోధుడిలా దానికి అడ్డుగోడగా నిలబడ్డాడు. చాలా సేపు కుక్కతో పోరాడాడు. ఆ ఘర్షణలో తన ముఖం చిట్లి రక్తం కారినా విడిచిపెట్టలేదు. ఆఖరుకు శబ్దాలు విని తల్లిదండ్రులు రాగా.. అప్పటికే ముఖం నిండా రక్తం కారుతూ ఉంది. తన ప్రియమైన చెల్లెలిని కుక్కల బారి నుంచి కాపాడుకునేందుకు ఎంతగా పోరాటం చేశాడంటే.. తన ప్రాణాలనే పణంగా పెట్టినంత పనిచేశాడు. ఆ దాడిలో చిన్నోడికి ఏకంగా 90 కుట్లు పడ్డాయి. ఆపరేషన్ చేసేందుకే డాక్టర్లు రెండు గంటలు శ్రమించారట.
ఈ విషయాన్ని తన అత్త సోషల్ మీడియాలో పెట్టగా.. విపరీతంగా వైరల్ అయింది. బాలుడి పోరాట పటిమను అందరూ ప్రశంసించారు. విషయం తెలుసుకున్న ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్(డబ్ల్యూబీసీ) బుడతడిని ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్(గౌరవార్థం)గా ప్రకటించింది. బ్రిడ్జర్‌కు అవార్డు ఇవ్వడాన్ని హెవీవెయిట్ ఛాంపియన్ టైసన్ ఫ్యూరీ వంటి ఎందరో స్వాగతించారు. మెచ్చుకుంటూనే చిన్నవయసులోనే వాకర్ మానవత్వాన్ని కొనియాడారు.