తెలంగాణ

telangana

ETV Bharat / sports

సలామ్‌ సెరెనా.. ఎన్నో సవాళ్లు దాటి అత్యున్నత స్థాయికి.. కానీ చివరి కోరిక తీరకుండానే

రాకెట్‌ పడితే ఆమె కోర్టులో సివంగి.. శ్వేతజాతీయుల ఆధిపత్యం కొనసాగిన టెన్నిస్‌లో వికసించిన నల్ల కలువ.. అమ్మాయిలను ఆట వైపు నడిపించిన స్ఫూర్తి శిఖరం. వివక్షను ప్రశ్నించే గొంతుక.. టెన్నిస్‌లో పురుషుల ఆధిక్యం ఏమిటి? మహిళలనూ సమానంగా చూడాలంటూ ప్రశ్నించిన ధీర వనిత! గర్భిణిగా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కొట్టిన యోధురాలు.. తల్లయ్యాక కూడా తగ్గేదేలే అంటూ అదరగొట్టిన అమ్మ. వ్యూహాలతో ఆదాయాన్ని ఆర్జిస్తున్న వ్యాపారవేత్త.. ఫ్యాషన్‌ ప్రియులకు కొత్త పాఠాలు నేర్పే మోడల్‌. ఇలా ఎన్నో ఎన్నెన్నో రూపాలు. అన్నింటా ఆమెది ప్రత్యేక ముద్ర. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆటతో అలరించిన ఆమే.. సెరెనా విలియమ్స్‌. యుఎస్‌ ఓపెన్‌లో ఓటమితో కన్నీళ్లతో కోర్టును వీడిన ఆమె ఓ అద్భుతం.

serena williams
సెరెనా విలియమ్స్‌

By

Published : Sep 4, 2022, 6:57 AM IST

Updated : Sep 4, 2022, 9:08 AM IST

Serena Williams: మహిళల టెన్నిస్‌పై తనదైన ముద్ర వేసిన అమెరికా తార సెరెనా విలియమ్స్‌ కెరీర్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడేసింది. వీడ్కోలుపై ముందే ప్రకటన చేసిన ఆమె.. దానిపై పునరాలోచన చేయనని స్పష్టం చేసింది.ఆటకే ఆకర్షణగా మారిన ఆమె.. కోర్టులో తన ప్రదర్శనతో, బయట తన వ్యక్తిత్వంతో కోట్లాది ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించింది. మహిళల సింగిల్స్‌లో 23, డబుల్స్‌లో 14, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో 2 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు, నాలుగు ఒలింపిక్‌ స్వర్ణాలతో శిఖరాగ్రానికి చేరుకుంది. ఆమె గురించి చెప్పాలంటే కేవలం ఈ విజయాలే సరిపోవు.

సెరెనా విలియమ్స్‌

ఆమెను చూసి ఎంతోమంది ఆటలోకి వచ్చారు. ఇప్పుడు ప్రధాన టోర్నీల్లో ఎక్కువ సంఖ్యలో నల్లజాతి అమ్మాయిలు ఆడుతున్నారంటే అందుకు కారణం ఆమెనే. ఈ నెల 26తో 41వ పడిలో అడుగుపెడుతున్న ఆమె మహిళల టెన్నిస్‌లో సాగించిన ఆధిపత్యం అమోఘం. తన బలంతో, ఫిట్‌నెస్‌తో ఆటలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పింది. తన శక్తిమంతమైన సర్వీస్‌లే ఆమె ఆటలో ప్రధాన ఆకర్షణ.

"ఎంతో అద్భుతమైన ప్రస్థానం ఇది. నా జీవితంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రిటైర్మెంట్‌పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదనే అనుకుంటున్నా. నేనో పోరాట యోధురాలిని. టెన్నిస్‌కు విభిన్నమైన రూపాన్ని తెచ్చానని భావిస్తున్నా. ఇప్పటికీ నాకు సామర్థ్యం ఉంది. కానీ ఓ అమ్మగా, సెరెనాలోని విభిన్న పార్శ్వాన్ని బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నా."

- సెరెనా విలియమ్స్​

అలా ఎదిగింది..
నాలుగేళ్ల వయసులోనే సెరెనా రాకెట్‌ పట్టింది. ఆరం భంలో వీనస్, సెరెనాలకు తల్లిదండ్రులే ఆటలో ఓనమాలు నేర్పారు. 1995లో 14 ఏళ్ల వయసులోనే సెరెనా ప్రొఫెషనల్‌ క్రీడాకారిణిగా మారింది. 16 ఏళ్ల వయసులో గ్రాండ్‌స్లామ్‌లో అడుగుపెట్టింది. 1998 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో తొలి సారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడిన ఆమె.. రెండో రౌండ్లో అక్క వీనస్‌ చేతిలో ఓడిపోయింది. 17 ఏళ్లకే గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల బోణీ కొట్టింది. 1999 యుఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె.. డబుల్స్‌లోనూ అక్కతో కలిసి ట్రోఫీ ముద్దాడింది.

సెరెనా విలియమ్స్‌

అక్కడి నుంచి మహిళల టెన్నిస్‌లో సెరెనా శకం మొదలైంది. సింగిల్స్‌లో టైటిళ్లు గెలిచే క్రమంలో తన సోదరిపైనా విజయాలు సాధించింది. వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను రెండు సార్లు (సెరెనా స్లామ్‌) ఖాతాలో వేసుకుంది. 2002లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకు చేరుకున్న ఆమె.. తన కెరీర్‌లో 319 వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగింది. డబుల్స్‌లో అక్కతో కలిసి అదరగొట్టింది. ఒలింపిక్స్‌ల్లో సింగిల్స్, డబుల్స్‌లో పసిడి సాధించి టెన్నిస్‌లో రెండు విభాగాల్లోనూ గోల్డెన్‌ స్లామ్‌ సొంతం చేసుకున్న మొట్టమొదటి ప్లేయర్‌ ఆమెనే.

సవాళ్లను దాటి..
టెన్నిస్‌లో సెరెనా సాధించిన విజయాల కంటే.. ఆ దిశగా ఆమె సాగించిన ఈ ప్రయాణం ఎంతో గొప్పది. అయితే ఆమె బాట పూల బాట కాదు. ఎన్నో అడ్డంకులను తెగువ, ఆత్మస్థైర్యంతో అధిగమించింది. కెరీర్‌ మంచి ఊపులో ఉన్నప్పుడు గాయాలు ఎదురైనా తిరిగి పుంజుకుంది. మోకాలి శస్త్రచికిత్స తర్వాత తిరిగి కోర్టులో అడుగుపెట్టి 2005 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో గెలిచింది. ఆ గాయం తిరగబెట్టడంతో దాదాపు ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న ఆమె.. ఏనాడూ నిరాశకు లోను కాలేదు. 2007 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో 81వ ర్యాంకు క్రీడాకారిణిగా అడుగుపెట్టి టైటిల్‌ నెగ్గి తన సత్తాచాటింది.

సెరెనా విలియమ్స్‌

2010లో వింబుల్డన్‌ టైటిల్‌ నెగ్గి 13వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న తర్వాత కొన్ని రోజులకే ఆమెకు తీవ్రమైన గాయమైంది. పగిలిన గాజుపై కాలు పెట్టడంతో తన పాదానికి రెండు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, ఉదర సమస్యలతోనూ పోరాడింది. రెండేళ్ల పాటు టైటిల్‌ గెలవలేకపోయింది. తొలి రౌండ్లో ఓటములు చవిచూసింది. పడి లేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగసింది. 2012 వింబుల్డన్‌ విజయంతో ఆమె కెరీర్‌ మళ్లీ జోరందుకుంది. తల్లి అయ్యేదాకా ఆమెకు తిరుగులేదు.

ఆ కల తీరకుండానే..
23 గ్రాండ్‌స్లామ్‌ విజయాలతో ఓపెన్‌ శకంలో సింగిల్స్‌లో (మహిళలు, పురుషులు కలిపి) అత్యధిక టైటిళ్లు గెలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన సెరెనాకు ఓ లోటు మిగిలిపోయింది. టెన్నిస్‌ చరిత్రలోనే అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో ఉన్న మార్గరెట్‌ కోర్ట్‌(24)ను అందుకోవాలన్న ఆమె కల తీరలేదు. 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో 23వ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న ఆమె.. గర్భం, బిడ్డకు జన్మనివ్వడంతో ఏడాదికి పైగా ఆటకు దూరమైంది. తిరిగి 2018 ఇండియన్‌ వేల్స్‌తో కోర్టులో అడుగుపెట్టింది. ఆ ఏడాది వింబుల్డన్, యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో ఆమెకు చుక్కెదురైంది. 2019లో మరోసారి ఆ రెండు టోర్నీల్లో తుదిపోరు చేరినా నిరాశ తప్పలేదు. ఆ తర్వాత కరోనా విరామం, వయసు ప్రభావం, గాయాల వల్ల తన ప్రదర్శన పడిపోయింది. 2021 వింబుల్డన్‌లో గాయపడ్డ ఆమె ఏడాది పాటు ఆటకు దూరమైంది.

సెరెనా విలియమ్స్‌

ఈ ఏడాది మళ్లీ వింబుల్డన్‌లోనే సింగిల్స్‌లో ఆడింది. ఇప్పుడు యుఎస్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌ దాటలేకపోయింది. ఇప్పటికే ఈ సీజన్‌ తన కెరీర్‌లో చివరిదని సంకేతాలిచ్చిన ఆమె ఇప్పుడిక 24వ టైటిల్‌ అందకుండానే ఆటకు దూరం కానుంది. ఆ రికార్డును చేరుకోలేకపోయినప్పటికీ సెరెనా ఆల్‌టైమ్‌ దిగ్గజం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 1968లో ఓపెన్‌ శకం ఆరంభమైన తర్వాత మహిళల సింగిల్స్‌లో ఆమె లాంటి క్రీడాకారిణి ఎవరూ రాలేదు. అంతకుముందే 13 టైటిళ్లు నెగ్గిన మార్గరెట్‌ ఈ శకంలో మరో 11 విజయాలు సాధించింది. కానీ సెరెనా మాత్రం పవర్‌ గేమ్‌తో.. మహామహులైన ప్రత్యర్థులను ఓడించి మరీ ముందుకు సాగింది. ఆటలో కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. టెన్నిస్‌లో సెరెనా పేరు ప్రత్యేకంగా నిలిచిపోవడం ఖాయం. ఆమె లాంటి క్రీడాకారిణి మరొకరు రావడం కష్టమే.

క్రీడాకారిణి మాత్రమే కాదు..
సెరెనా కేవలం టెన్నిస్‌ క్రీడాకారిణి మాత్రమే కాదు. ఎన్నో రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. తన అసమాన కెరీర్‌తో మరెంతో మంది అమ్మాయిలు, ముఖ్యంగా నల్లజాతి మహిళలు ఆటవైపు నడిచేలా దారి చూపింది. 1958లో గిబ్సన్‌ యుఎస్‌ ఓపెన్‌ విజయం తర్వాత నాలుగు దశాబ్దాల్లో మరో నల్లజాతి క్రీడాకారిణి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలవలేకపోయింది. అప్పుడు సెరెనా వచ్చింది. 1999లో యుఎస్‌ ఓపెన్‌ విజయంతో చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచి మొదలు.. ఆమె సాధించిన ఒక్కో విజయం ఎంతో మందిలో ప్రేరణ నింపింది. నల్లజాతీయులపై వివక్షకు వ్యతిరేకంగా గొంతెత్తడంలో ఆమె ఎప్పుడూ ముందుంటోంది. ఆ వివక్షను దాటుకుని ఆమె ఈ స్థాయికి చేరడం సాధారణ విషయం కాదు.

ఇక టెన్నిస్‌లో పురుషుల ఆధిక్యం ఏమిటీ? మహిళలనూ సమానంగా చూడాలంటూ ప్రశ్నించిన వీర వనిత ఆమె. టోర్నీ నగదు బహుమతిలో తేడాలతో పాటు, కోర్టులో ప్రతినిధులు వ్యవహరించే తీరు, వేదికల విషయంలో అన్యాయం.. ఇలా తేడాగా చూసే ప్రతి విషయంలోనూ న్యాయం కోసం పోరాడింది. గర్భిణిగా బరిలో దిగడమే కాకుండా 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన యోధురాలు. బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా మరణం అంచుల వరకూ వెళ్లివచ్చి.. తిరిగి మునుపటి ఫిట్‌నెస్‌ సాధించి కోర్టులో అడుగుపెట్టింది. తనయ ఆలనాపాలనా చూసుకుంటూ ఆటలో కొనసాగింది. వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థను ఏర్పాటు చేసి వ్యాపార రంగంలోనూ రాణిస్తోంది. కొత్త ఫ్యాషన్‌ పోకడలను ఎప్పటికప్పుడూ అనుసరిస్తూ ప్రత్యేకంగా నిలుస్తోంది. వ్యాపార ప్రకటనలతో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

  • రూ.754 కోట్లు.. తన కెరీర్‌లో టెన్నిస్‌ ద్వారా సెరెనా అందుకున్న నగదు బహుమతి.
  • 1..వరుసగా అత్యధిక వారాల పాటు (186) అగ్రస్థానంలో కొనసాగిన క్రీడాకారిణిగా స్టెఫీగ్రాఫ్‌తో కలిసి సెరెనా అగ్రస్థానంలో ఉంది.
  • 2.. ఓపెన్‌ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు (23) గెలిచిన క్రీడాకారిణి సెరెనానే. ఓవరాల్‌గా మార్గరెట్‌ కోర్ట్‌ (24) తర్వాత రెండో స్థానంలో ఉంది.
  • 14.. 2001లో ఇండియన్‌ వెల్స్‌ టోర్నీలో జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్న సెరెనా.. ఆ తర్వాత 14 ఏళ్ల పాటు ఆ టోర్నీలో ఆడకుండా బహిష్కరించింది.
  • 23..సింగిల్స్‌లో సెరెనా గ్రాండ్‌స్లామ్‌ విజయాలు. ఇందులో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌-7 (2003, 2005, 2007, 2009, 2010, 2015, 2017), ఫ్రెంచ్‌ ఓపెన్‌-3 (2002, 2013, 2015), వింబుల్డన్‌-7 (2002, 2003, 2009, 2010, 2012, 2015, 2016), యుఎస్‌ ఓపెన్‌-6 (1999, 2002, 2008, 2012, 2013, 2014) టైటిళ్లు ఉన్నాయి.

ఇదీ చదవండి:400 వజ్రాలు పొదిగిన షూ, స్పెషల్​ స్కర్ట్​.. చివరి టోర్నీలో సెరెనా స్టైల్ స్టేట్​మెంట్​

Last Updated : Sep 4, 2022, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details