Asian Games: బ్యాడ్మింటన్ టీనేజీ సంచలనం ఉన్నతి హుడా ఈ ఏడాది ఆసియా క్రీడలకు ఎంపికైంది. 14 ఏళ్ల ఈ రోహ్‌తక్ బాలిక.. ఆసియా క్రీడల బృందంలో అత్యంత పిన్న వయస్సు కలిగిన భారత షట్లర్‌గా నిలిచింది. ఆసియా, కామన్వెల్త్ క్రీడలు, థామస్ అండ్ ఉబర్ కప్‌లో పాల్గొనే షట్లర్ల ఎంపిక కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆరు రోజుల సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్స్‌లో ప్రదర్శన ఆధారంగా పైన పేర్కొన్న మూడు టోర్నీలకు గురువారం జట్లను ప్రకటించింది. మహిళల సింగిల్స్‌లో మూడో స్థానంలో నిలిచిన ఉన్నతి.. ఆసియా క్రీడలతో పాటు ఉబర్ కప్‌నకు ఎంపికైంది. అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధుతో పాటు లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ జట్లను నడిపించనున్నారు. మరోవైపు గాయత్రి పుల్లెల- ట్రీసా జోడీ ట్రయల్స్‌లో అగ్రస్థానంలో నిలిచి ఈ మూడు టోర్నీల్లో పోటీపడే జట్లలో చోటు దక్కించుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-15 లోపు ఉన్న సింధు, లక్ష్యసేన్, శ్రీకాంత్, సాత్విక్- చిరాగ్ జోడీ నేరుగా పోటీపడే అవకాశం కలిగింది.
పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 23వ ర్యాంకులో ఉన్నప్పటికీ ఇటీవల అతని ఉత్తమ ప్రదర్శన కారణంగా ట్రయల్స్‌తో సంబంధం లేకుండా తననూ తీసుకున్నారు. ప్రణయ్‌ను జట్టులోకి తీసుకుని తనను పక్కనపెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సైనా ఈ ట్రయల్స్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్‌లో సైనా కూడా 23వ ర్యాంకులోనే ఉంది. మరోవైపు 40 మంది (20 చొప్పున మహిళలు, పురుషులు) షట్లర్లను సీనియర్ జాతీయ శిక్షణ శిబిరానికి, 2024 ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేలా ప్రధాన బృందంగా ఎంపిక చేశారు. ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడలు (జులై 28- ఆగస్టు 8) బర్మింగ్‌హామ్‌లో, ఆసియా క్రీడలు (సెప్టెంబర్ 10- 25) చైనాలో, థామస్ అండ్ ఉబర్ కప్ (మే 8- 15) బ్యాంకాక్‌లో జరగబోతున్నాయి.