ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా (60) అభిమానులను శోకసంద్రంలో ముంచి మరో లోకానికి చేరుకున్నాడు. అద్భుతమైన ఆటతో ప్రపంచ ఫుట్‌బాల్‌ను సుసంపన్నం చేసిన ఈయన.. బుధవారం గుండెపోటుతో మరణించాడు. కళ్లు చెదిరే విన్యాసాలతో 1986లో అర్జెంటీనాకు ప్రపంచకప్‌ను అందించిన డీగో.. కొకైన్ వాడకం, ఊబకాయంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. మెదడుకు శస్త్రచికిత్స తర్వాత రెండు వారాల కిందే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే అకస్మాత్తుగా మృతి చెందడం వల్ల క్రీడాలోకం సంభ్రమాశ్చర్యానికి గురైంది. అలాంటి దిగ్గజ ఫుట్‌బాలర్ జీవితాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం.
మారడోనా జీవితంలోని కీలక సంఘటనలు:
1960: అర్జెంటీనాలోని లానస్లో 1960 అక్టోబరు 30న జన్మించాడు.
1970:లాస్ సెబోలిటాస్ యువ జట్టులో చేరాడు.
1971: 11 ఏళ్ల వయసులో అర్జెంటీనా జూనియర్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
1976: 15 ఏళ్లకే ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారి అర్జెంటీనా జూనియర్ జట్టులో అరంగేట్రం చేశాడు.
1977: 16 ఏళ్ల వయసుకే అర్జెంటీనా జట్టు తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లో భాగమయ్యాడు.
1978: అర్జెంటీనా జాతీయ జట్టుకు ఎంపికైన అతిపిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు.
1979:మారడోనా తొలి అంతర్జాతీయ గోల్ చేయడం సహా ఇదే ఏడాది జూనియర్ ప్రపంచకప్ విజేతగా అర్జెంటీనా నిలిచింది.
1980:స్పానిష్ లీగ్‌లో బార్సిలోనా జట్టు మారడోనాతో ఒప్పందం కుదుర్చకుంది.
1981:రూ.14.47 కోట్లతో అర్జెంటీనాకు చెందిన బోకా జూనియర్స్ జట్టు మారడోనాను సొంతం చేసుకుంది.
1982:అర్జెంటీనా జట్టు తరపున మొదటి ఫిఫా ప్రపంచకప్ ఆడి రెండు గోల్స్ చేశాడు. ఆ తర్వాత రూ. 72.44 కోట్లతో బార్సిలోనా ఎఫ్‌సీ ఒప్పందానికి సంతకం చేశాడు. అప్పట్లో అది ప్రపంచ రికార్డు.
1983:స్పానిష్ లీగ్‌లో బార్సిలోనా జట్టు విజయం సాధించడానికి సహకరించాడు.
1984:రూ. 99.98 కోట్లకు బార్సిలోనా క్లబ్ నుంచి నాపోలీ క్లబ్ మారడోనాను సొంతం చేసుకుంది. ఇది మరో రికార్డు.
1986:అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా ప్రపంచకప్ గెలిపించాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో రెండు గోల్స్ చేశాడు. అందులో ఒకటి 'శతాబ్దపు గోల్'గా ఫిఫా 2002లో గుర్తించింది.
1987:నాపోలీకి తొలి ఇటాలియన్ టైటిల్ గెలవడానికి సహాయపడ్డాడు.
1989:క్లావ్డియా విల్లాఫేన్ను వివాహమాడాడు.
1990:ప్రపంచకప్ ఫైనల్లో పశ్చిమ జర్మనీ చేతిలో ఓడిపోయిన తర్వాత పితృత్వ దావాను ఎదుర్కొన్నాడు.