ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ రూపొందించిన హాలీవుడ్ చిత్రం 'ద టెర్మినల్' గుర్తుందా? అందులో ఓ వ్యక్తి అమెరికాలో అడుగుపెట్టేందుకు అనుమతి లేకపోవడం వల్ల విమానాశ్రయంలోనే ఏడాది పాటు ఉండిపోతాడు. తాజాగా అదే రీతిలో ఓ యువ ఫుట్‌బాల్ ప్లేయర్ 74 రోజులు ఎయిర్‌పోర్టులోనే ఉన్నాడు. తాజాగా ఈ విషయం బయటకు రాగా.. వెంటనే స్పందించిన ప్రభుత్వం అతడికి సాయమందించింది. విదేశీ విమాన సర్వీసులు ప్రారంభమయ్యేవరకు అతడు ఓ హోటల్లో ఆశ్రయం ఉండేలా ఏర్పాట్లు చేసింది.
ఇదీ జరిగింది..
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తక్షణమే దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేసింది. అయితే ఘనా దేశానికి చెందిన 23 ఏళ్ల ఫుట్‌బాల్ ప్లేయర్ రాండీ జుయన్ ముల్లర్.. కేరళలో ఓ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. కెన్యా ఎయిర్వేస్ విమానంలో స్వదేశానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుని ముంబయి రాగా.. లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు. అప్పటి నుంచి దాదాపు 74 రోజులు ఎయిర్‌పోర్టులోనే గడిపాడు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్యా థాక్రేకు తెలియజేయగా.. వెంటనే స్పందించారు. అతడికి సాయం చేసేందుకు స్థానిక యువజన నాయకుడు రాహుల్ కనల్ను పంపించారు.