ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యింది. బీసీసీఐ విధించిన గడువు కూడా ముగిసింది. దీంతో 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించాయి. ఇక డిసెంబర్ 23న కేరళలోని కొచ్చి వేదికగా మినీ వేలం జరగనుంది. పేరుకు మినీ వేలమే అయినా.. కావాల్సిన ఆటగాళ్ల కోసం కోట్లు ఇచ్చేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి.
అయితే ఈ మినీ వేలంలో జింబాబ్వే స్పిన్ ఆల్‌రౌండర్ సికిందర్ రాజా పంట పండనుంది. ఆస్ట్రేలియా వేదికగా ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2022లో సికిందర్ రాజా అద్భుత ప్రదర్శనను కనబరిచాడు. మొత్తం 8 ఇన్నింగ్స్‌ల్లో 27.37 సగటుతో 219 పరుగులు చేసిన సికిందర్ రాజా.. 11 సిక్స్‌లు సిక్సులు కొట్టి ఔరా అనిపించుకున్నాడు. 15.60 యావరేజ్‌తో 10 వికెట్లు పడగొట్టాడు.
టీ20 ప్రపంచకప్ ప్రదర్శనతో..జింబాబ్వే సూపర్ -12 చేరి.. రన్నరప్ పాకిస్థాన్‌ను ఓడించింది. ఆ మ్యాచ్‌లో సికిందర్ రాజా కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన సికిందర్ రాజా.. రాబోయే ఐపీఎల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ ఆడే అవకాశం ఈ జింబాబ్వే ప్లేయర్‌కు దక్కలేదు. కానీ తాజా ప్రపంచకప్ ప్రదర్శనతో అతనిపై ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి పడింది. ఈ క్రమంలోనే అతని కోసం పలు ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. అదే జరిగితే సికిందర్ రాజాకు భారీ ధర పలికే అవకాశం ఉంది.
సులభంగా రూ.5 కోట్లు..డిసెంబర్ 23న జరిగే మినీ వేలంలో దాదాపు రూ.5 కోట్లకు పైగానే సికిందర్ రాజా పలికే అవకాశం ఉన్నట్లు ఆకాశ్ చోప్రా వంటి క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే సీజన్ భారత్‌లోనే జరుగుతుండటం, సికిందర్ రాజా క్వాలిటీ స్పిన్ ఆల్‌రౌండర్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతడికి కలిసొచ్చే అంశం. అంతేకాకుండా మిడిలార్డర్ ధాటిగా ఆడగలడు. కాబట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతని కోసం పోటీపడే అవకాశం ఉంది.