పాకిస్థాన్ బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్(Younis Khan) గత నెల తప్పుకొన్నాడు. అందుకు గల కారణం తెలియరాకపోయినా సీనియర్ క్రికెటర్ హసన్ అలీ(Hasan Ali)తో గొడవే (ice bath controversy) ఇందుకు కారణమని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన యూనిస్.. అదేం లేదని స్పష్టం చేశాడు.
"అసలు ఈ విషయం బయటకు ఎలా వచ్చిందో తెలియదు. ఆ సమయంలో ఇది చాలా వైరల్ అయింది. అలాంటివి క్రికెట్ పర్యటనల్లో మామూలే. ఇలాంటి వాటికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అతడు జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. ఇలాంటి వార్తలు అతడిని మానసికంగా బాధపెడతాయి."
-యూనిస్ ఖాన్, పాక్ కోచ్
అలాగే 'బ్యాటింగ్ కోచ్ పదవికి రాజీనామా ఎందుకు ప్రకటించారు?' అన్న ప్రశ్నకు స్పందించాడు యూనిస్. "నాకు, పీసీబీకి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం మరో ఆరు నెలలు మేము దాని గురించి ఏం చెప్పలేం. కానీ హసన్కూ, నా రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదు" అని స్పష్టం చేశాడు యూనిస్.
అసలు ఈ గొడవేంటి?
సౌతాఫ్రికా పర్యటన సమయంలో శిక్షణలో భాగంగా ఐస్ బాత్ (చల్లటి నీళ్లలో ఉండటం) చేయమని హసన్ అలీకి యూనిస్ చెప్పాడట. కానీ ఇందుకు హసన్ తిరస్కరించాడని సమాచారం. దీంతో కోపంతో హసన్‌పై విరుచుకుపడిన యూనిస్.. ట్రైనర్ యాసిర్ మాలిక్‌కు అతడిపై ఫిర్యాదు చేశాడట. వీరి మధ్య బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ మధ్యవర్తిత్వం చేసినా.. యూనిస్ మాత్రం అతడిపై కోపంతోనే ఉన్నాడని తెలిసింది.