తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC Final: డబుల్​ ధమాకాతో మొదలై.. ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి - teamindia australia tour

క్రికెట్‌ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌(WTC Final) పోటీల్లో టీమ్‌ఇండియా అదిరిపోయే ఆటతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గతేడాది న్యూజిలాండ్‌తో మినహా మిగిలిన అన్ని సిరీస్‌ల్లోనూ విజయాలు సాధించి సగర్వంగా తుదిపోరుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే వచ్చేవారం అదే కివీస్‌ జట్టుతో ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే, ఇప్పటివరకు భారత్‌ ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఎలా ఆడింది.. ఎవరిని ఎలా ఓడించింది.. ప్రయాణం ఎలా సాగించింది అనే విషయాలపై క్లుప్తంగా ఓసారి గుర్తుచేసుకుందాం..

teamindia
టీమ్​ఇండియా

By

Published : Jun 12, 2021, 10:50 AM IST

Updated : Jun 12, 2021, 1:04 PM IST

2019 వన్డే ప్రపంచకప్‌(Worldcup) ముగిశాక ఐసీసీ ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ప్రవేశపెట్టింది. టీమ్‌ఇండియా(TeamIndia) తొలి సిరీస్‌లో కరీబియన్‌ గడ్డపై వెస్టిండీస్‌తో తలపడింది. అక్కడ ఆడిన రెండు టెస్టుల్లోనూ కోహ్లీసేన ఘన విజయం సాధించింది. దాంతో ఈ మెగా టోర్నీని విజయాలతో ఆరంభించింది. తొలి టెస్టులో 318 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన టీమ్‌ఇండియా రెండో టెస్టులోనూ 257 పరుగులతో భారీ విజయం నమోదు చేసింది. అయితే తొలి మ్యాచ్‌లో సాధించిన విజయమే పరుగుల పరంగా విదేశాల్లో భారత్‌కు అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ సిరీస్‌లో అజింక్య రహానె (271), హనుమ విహారి (289) బ్యాట్‌తో అదరగొట్టగా ఇషాంత్‌(11), బుమ్రా(13) వికెట్లతో చెలరేగారు.

టీమ్​ఇండియా

డబుల్‌ ధమాకాలతో అలరించి..

ఇక భారత్‌ రెండో సిరీస్‌లో స్వదేశంలోనే దక్షిణాఫ్రికాతో తలపడింది. ఇక్కడ మూడు టెస్టులు జరగ్గా టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ డబుల్‌ సెంచరీలతో అలరించారు. అప్పటివరకు టెస్టుల్లో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగిన రోహిత్‌(Rohith Sharma) ఈ సిరీస్‌తోనే ఓపెనింగ్‌ చేయడం ప్రారంభించాడు. దాంతో తొలి టెస్టులోనే (176, 127) రెండు శతకాలతో చెలరేగాడు. అలాగే మూడో టెస్టులో (212) ద్విశతకం సాధించి ఓపెనర్‌గా ఫిక్సయ్యాడు. ఇక మయాంక్‌ అగర్వాల్‌ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో (215) ద్విశతకం సాధించగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో (108) శతకంతో మెరిశాడు. మరోవైపు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో (254*) భారీ ద్విశతకంతో చెలరేగాడు. అలా టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఈ సిరీస్‌లో మ్యాచ్‌కు ఒకరు చొప్పున డబుల్‌ ధమాకాలు పేల్చారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా వరుసగా 203, ఇన్నింగ్స్‌ 137, ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించింది.

రోహిత్​

విరాట్‌ చివరిసారి శతకం బాది..

భారత్‌ తన మూడో సిరీస్‌ను పొరుగుదేశం బంగ్లాదేశ్‌తో స్వదేశంలోనే తలపడింది. రెండు టెస్టుల ఈ సిరీస్‌ను సైతం కోహ్లీసేన(Kohli) క్లీన్‌స్వీప్‌ చేయడం విశేషం. దాంతో పాయింట్ల పట్టికలో అందరికన్నా ముందు నిలిచి ఇతర జట్లకు బలమైన హెచ్చరికలు జారీ చేసింది. తొలి మ్యాచ్‌లో బంగ్లా ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వగా రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. ఈ క్రమంలోనే తొలి టెస్టులో మయాంక్‌ అగర్వాల్‌ (243) మరోసారి బ్యాట్‌ ఝుళిపించి డబుల్‌ సెంచరీ సాధించాడు. అనంతరం కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు (భారత్‌కు తొలి డే/నైట్‌ టెస్టు)లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (136) శతకంతో చెలరేగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడికి అదే ఇప్పుడు చివరి శతకంగా మిగిలిపోవడం గమనార్హం. కెరీర్‌ మొదలైనప్పటి నుంచి కోహ్లీ సెంచరీ చేయడానికి ఇంత వ్యవధి ఎప్పుడూ తీసుకోలేదు. దాంతో ఫైనల్లోనైనా టీమ్‌ఇండియా సారథి మూడంకెల స్కోర్‌ అందుకోవాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

కోహ్లీ

న్యూజిలాండ్‌లో ఓటమి పాలై..

అప్పటివరకూ వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్‌ఇండియాకు న్యూజిలాండ్‌ షాకిచ్చింది. గతేడాది కరోనా ప్రారంభ దశలో కోహ్లీసేన కివీస్‌ పర్యటనకు వెళ్లగా అక్కడ ఆడిన రెండు టెస్టుల్లోనూ ఓటమిపాలైంది. దాంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తొలిసారి ఎదురు దెబ్బ తగిలింది. కివీస్‌ బౌలర్ల ధాటికి పరుగులు చేయలేక టాప్‌ బ్యాట్స్‌మెన్‌ సైతం చతికిలపడ్డారు. మరోవైపు బౌలర్లు కూడా ప్రభావం చూపకపోవడంతో ఆ జట్టు రెండు టెస్టుల్లోనూ ఘన విజయాలు సాధించింది. తొలి మ్యాచ్‌ను పది వికెట్ల తేడాతో కైవసం చేసుకున్న న్యూజిలాండ్‌ రెండో టెస్టును ఏడు వికెట్లతో సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో భారత్‌ తరఫున తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్‌(58) అర్ధశతకం సాధించగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పృథ్వీషా(54), పుజారా(54), హనుమ విహారి(55) అదే ఘనత సాధించారు. కివీస్‌ పిచ్‌లపై భారత ఆటగాళ్లు సమష్టిగా విఫలమవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో సిరీస్‌ల్లోనూ కోహ్లీసేన మట్టికరుస్తుందని పలువురు క్రికెట్‌ పండితులు అంచనా వేశారు.

పంత్​

ఆస్ట్రేలియాలో వావ్‌ అనిపించి..

గతేడాది లాక్‌డౌన్‌ తర్వాత టీమ్‌ఇండియా అంతర్జాతీయ పర్యటన ఆస్ట్రేలియాతో ప్రారంభమైంది. అయితే, ఈ సిరీస్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటైన భారత్‌ తర్వాత సిరీస్‌ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. రెండో టెస్టు నుంచి కెప్టెన్‌ విరాట్ కోహ్లీ జట్టుకు దూరమవ్వడం, ఇతర సీనియర్లు గాయాల బారినపడటం అంతా ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న యువ ఆటగాళ్లు భారత రిజర్వ్‌బెంచ్‌ ఎంత బలంగా మారిందో చాటిచెప్పారు. తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె(112) రెండో టెస్టులో శతకంతో ఆదుకోగా, మూడో టెస్టులో పంత్‌(97), రవిచంద్రన్‌ అశ్విన్(39*), హనుమ విహారి(23*) ఆదుకున్నారు. ముఖ్యంగా మ్యాచ్‌ చేజారిపోతుందనుకునే దశలో అశ్విన్‌, విహారి నాలుగు గంటలకు పైగా క్రీజులో పాతుకుపోయి ఓటమి నుంచి తప్పించారు. ఇక నాలుగో టెస్టు గబ్బాలో వాషింగ్టన్‌ సుందర్‌(62), శార్ధూల్‌ ఠాకుర్‌(67), శుభ్‌మన్‌ గిల్‌(91), పుజారా(56), రిషభ్‌ పంత్‌(89నాటౌట్‌) అద్భుతంగా ఆడి చిరస్మరణీయ విజయం అందించారు. దాంతో కంగారూల గడ్డపై టీమ్‌ఇండియా వరుసగా రెండోసారి బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ నిలబెట్టుకోవడమే కాకుండా అందరి చేతా ప్రశంసలు అందుకుంది.

ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి..

ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌ చివరిగా పోటీపడింది బలమైన ఇంగ్లాండ్‌ జట్టుతో. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌లో తొలి టెస్టులో 227 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన టీమ్‌ఇండియా తర్వాత అనూహ్యంగా పుంజుకొని చివరి మూడు టెస్టుల్లో అద్భుత విజయాలు సాధించింది. దాంతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచి సగర్వంగా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌(218) తొలి టెస్టులో దంచికొట్టగా తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మరోవైపు భారత స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌(23), అక్షర్‌ పటేల్‌(27) ఆ మూడు టెస్టుల్లో బంతులను గింగిరాలు తిప్పడంతో ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడానికి ముప్పుతిప్పలు పడ్డారు. ఈ క్రమంలోనే రెండో టెస్టులో రోహిత్‌ (161), అశ్విన్‌(106) శతకాలతో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ మ్యాచ్‌లో భారత్‌ 317 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఇక ఆఖరి రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్‌ భారీ స్కోర్లు సాధించకపోవడంతో కోహ్లీసేన మూడో మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో, నాలుగో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. దాంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ మొత్తం 17 మ్యాచ్‌లు ఆడగా 12 విజయాలు, నాలుగు ఓటములతో పాటు ఒక మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. జూన్‌ 18న న్యూజిలాండ్‌తో తుదిపోరులో తలపడనుంది.

ఇదీ చూడండి: WTC Final: భారత జట్టుకు అదే కీలకం!

Last Updated : Jun 12, 2021, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details