ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఐదో రోజు ఆట కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరుజల్లులు కురిసేందుకు ఆస్కారం ఉన్నా ఎండ కాస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరం వైపు చల్లని గాలులు వీస్తాయని పేర్కొంది. మబ్బులు పట్టడం వల్ల వెలుతురు తక్కువగా ఉంటుందని వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4 గంటలకు సౌథాంప్టన్‌లో వర్షం పడటం గమనార్హం.
WTC Final: వరుణుడు కరుణిస్తేనే! - డబ్ల్యూటీసీ ఫైనల్
టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఐదో రోజు మ్యాచ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. సౌథాంప్టన్‌లో ఈరోజు చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నా.. ఎండ కాస్తుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఫైనల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అర్థం కావడం లేదు. ఐదు రోజుల నుంచి సౌథాంప్టన్‌లో వర్షం పడటమే ఇందుకు కారణం. వరుణుడి వల్ల తొలిరోజు పూర్తిగా మ్యాచ్ జరగలేదు. రెండో రోజు 64.4 ఓవర్ల ఆట సాధ్యమైంది. ఆ రోజు టీమ్‌ఇండియా ఆధిపత్యం సాధించింది. మూడో రోజు మాత్రం కివీస్‌దే పైచేయి. భారత్‌ను 217కు ఔట్ చేయడమే కాకుండా 101/2తో నిలిచింది. నాలుగోరోజు, సోమవారం నిరంతరాయంగా వర్షం కురవడం వల్ల ఆట మొత్తంగా సాధ్యపడలేదు. మరి మంగళవారం ఏం జరుగుతుందో చూడాలి.