WTC Final 2023 Kohli : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీకి రికార్డులు కొత్తేమి కాదు. అతడు బ్యాట్ పడితే.. ఓ వైపు పరుగుల వరద పారుతుంటుంది. మరోవైపు రికార్డులు చకా చకా నడుచుకుంటూ అతడి ఖాతాలోకి వచ్చేస్తుంటాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిత లిఖించుకున్న అతడు... ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ కొన్నింటిని అందుకున్నాడు.
- ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు సచిన్ తెందుల్కర్ 657 పరుగులతో తొలి స్థానంలో ఉండగా.. ఇప్పుడు విరాట్ సచిన్‌ను అధిగమించి 660 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఘనత సాధించాడు.
- డబ్ల్యూటీసీలో టీమ్ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ విరాట్ రికార్డు సాధించాడు. అలాగే ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గానూ విరాట్ మార్క్‌ను అందుకున్నాడు.
- అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై 5 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. అదే సమయంలో టెస్టుల్లోనూ ఆస్ట్రేలియాపై 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.
జడేజా రికార్డు
WTC final jadeja : అంతకుముందు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా రికార్డు సృష్టించాడు. బిషన్ సింగ్ బేడీని అధిగమించాడు. అత్యంత విజయవంతమైన భారత ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మూడో రోజు ఆటలో స్మిత్, ట్రావిస్ హెడ్‌లను ఔట్ చేసి ఈ ఘనతను అందుకున్నాడు. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ సహా ఈ మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు వికెట్లు తీశాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 268 వికెట్లు ఉన్నాయి. బేడీ 67 టెస్టుల్లో 266 వికెట్లు పడగొట్టాడు.